ఒక సినిమా ల్యాబులో పన్నెండు సంవత్సరాలు మగ్గి అసలు రిలీజవుతుందో లేదోనని ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకుంటే ఎవరైనా దాని కోసం ఎదురు చూడటం మానేస్తారు. మదగజరాజా అలాంటి బాపతు కిందకే వస్తుందని అందరూ భావించారు. కట్ చేస్తే నిన్న విడుదలైన ఈ మూవీకి తమిళంలో అనూహ్య మద్దతు దక్కింది.
నిన్న ఒక్క రోజే బుక్ మై షోలో 80 వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోవడమంటే మాటలు కాదు. పొంగల్ పండక్కు థియేటర్ వినోదాన్ని ప్రధానంగా భావించే అరవ ప్రేక్షకులు మొదటి ఛాయస్ గా దీన్నే పెట్టుకుని పొలోమంటూ హౌస్ ఫుల్స్ చేస్తున్నారు.
అలాని మదగజరాజ ఏదో అవుట్ అఫ్ ది బాక్స్ ట్రెండ్ సెట్టర్ అనుకునేరు. అలాంటిదేమీ లేదు. రొటీన్ ఫార్ములాతో అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా దర్శకుడు సుందర్ సి 2012కే ఇది కొంచెం అవుట్ డేటెడ్ అనిపించేలా తీశాడు. కాకపోతే ఇలాంటి ఫన్ గత కొన్నేళ్లలో ఎవరూ ఇవ్వకపోవడంతో జనాలు దీన్నే ఎంజాయ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది.
వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇది రెండో సినిమా. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ తల్లిగా వయసు మళ్ళిన పాత్రలో కనిపించిన అంజలి మదగజరాజలో గ్లామర్ షో చేయడం వెరైటీ ట్విస్టు. మొత్తానికి భోజనం రుచిగా లేకపోయినా ఆకలి తీర్చిన ఘనత మదగజరాజకు దక్కింది.
ఇక విశాల్ సంగతికొస్తే వరస ఫ్లాపులతో పాటు కొంచెం అనారోగ్యం కారణంగా డీలా పడిన ఇతనికి మదగజరాజ రెస్పాన్స్ మంచి కిక్ ఇచ్చిందని సన్నిహితుల మాట. లుక్స్ పాతవే అయినప్పటికీ ఎనర్జీ అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంటుందని, తను ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారో మదగజరాజ ఋజువు చేసిందని అంటున్నారు.
సో గత కొన్నేళ్లుగా ప్రయోగాల బాట పట్టిన విశాల్ మళ్ళీ రూట్ మారుస్తాడేమో చూడాలి. ఇక బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కంపోజ్ చేసిన పాటలు, బిజిఎం ఈ సినిమాని నిలబెట్టింది. అన్నట్టు త్వరలోనే తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.