గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ డెబ్యూకు బ్రేక్ పడటం అభిమానులకు షాక్ ఇచ్చింది. ముహూర్తం, హీరోకు స్వల్ప అస్వస్థత వల్ల వాయిదా వేయలేక తప్పలేదని బాలకృష్ణ చెప్పారు కానీ అసలేం జరిగిందనే దాని మీద రకరకాల ప్రచారాలు బయటికొచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ తో సహా సర్వం సిద్ధం చేసుకుని ఉండగా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ కావడం ఊహించని పరిణామం. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో మంచి పవర్ ఫుల్ సబ్జెక్టుని తయారు చేసుకున్నాడనే టాక్ అంతకు ముందే వచ్చింది.
సంక్రాంతి పండగ వచ్చేసింది కాబట్టి ఇప్పుడేమైనా శుభవార్త వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. డాకు మహారాజ్ విడుదల హడావిడి ఉంది కాబట్టి మోక్షజ్ఞకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం వల్ల తామే డైవర్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన మానుకున్నారు. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లానింగ్ ఉందని అంటున్నారు. అసలు మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలోనే డెబ్యూ ఉంటుందా లేక దర్శకుడు మారతాడా అనే అనుమానాలు కూడా జనంలో లేకపోలేదు.
ఇంకోవైపు ఆదిత్య 369 సీక్వెల్ కు బాలకృష్ణ రెడీ అవుతున్నారు. వెంటనే కాదు కానీ ఫైనల్ వెర్షన్ రెడీ చేసుకుని, క్యాస్టింగ్ తదితర పనులు త్వరలోనే షురూ చేస్తారట. దీంట్లో మోక్షజ్ఞని భాగం చేయాలనేది బాలయ్య ఆలోచన. దర్శకత్వం కూడా ఆయనే చేస్తారు. ఒకపక్క అభిమానులు మాత్రం రామ్ చరణ్ చిరుత, మహేష్ బాబు రాజకుమారుడు, ప్రభాస్ ఈశ్వర్ తరహాలో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో మోక్షజ్ఞని లాంచ్ చేయమని అడుగుతున్నారట. ఏది ఏమైనా వీలైనంత వరకు ఈ కన్ఫ్యూజన్ ని త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే బాగా ఆలస్యం జరిగిపోయింది.