వెబ్ సిరీస్‌ కోసం హీరో వంద కోట్ల డీల్

ఇండియాలో అఫీషియల్‌గా చెప్పాలంటే ఒక సినిమాకు వంద కోట్లు తీసుకునే హీరోలే లేరు. అలాంటిది ఒక హీరో వెబ్ సిరీస్ కోసం వంద కోట్లు తీసుకుంటున్నాడంటే అది అతిశయోక్తి లాగే అనిపిస్తుంది. కానీ ఇది నిజం అంటోంది బాలీవుడ్ మీడియా. ఆ హీరో ఏ ఆమిర్ ఖానో సల్మాన్ ఖానో అక్షయ్ కుమారో కూడా కాదు.

వాళ్ల తర్వాతి స్థాయి స్టార్ అయిన షాహిద్ కపూర్ అంటుండటం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. అతడితో ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రూ.100 కోట్లకు డీల్ చేసుకుందట. షాహిద్‌తో ఒక ప్రపంచ స్థాయి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయడానికి ఆ సంస్థ భారీ బడ్జెట్‌ను కేటాయించిందట. ఈ సిరీస్‌ను తెలుగు వాళ్లయిన దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందించనున్నట్లు సమాచారం.

ఒకప్పుడు షాహిద్ స్థాయి తక్కువే కానీ.. గత ఏడాది ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో అతడి రేంజే మారిపోయింది. ఇప్పుడు అతను ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఐతే సినిమాతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్‌తో చేయబోయే వెబ్ సిరీస్‌కు ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉంది. రెండు సీజన్ల పాటు నడిచే ఈ థ్రిల్లర్ కోసం చాలా సమయమే వెచ్చించాలి, కష్టం కూడా ఎక్కువే. అందుకే రూ.100 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడట షాహిద్. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఇలా వందల కోట్లు పెట్టి ఒరిజినల్స్ తీయడం మామూలే.

ఇండియాలో ఓటీటీ విప్లవం మొదలైన నేపథ్యంలో తమ పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని నెట్ ఫ్లిక్స్ గుర్తించింది. ఇక రాజ్-డీకేల విషయానికి వస్తే షోర్ ఇన్ ద సిటీ, గో గోవా గాన్, స్త్రీ లాంటి సినిమాలతో పేరు సంపాదించిన ఈ దర్శక ద్వయం.. అమేజాన్ ప్రైమ్ కోసం చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం దాని రెండో సీజన్ రెడీ చేస్తున్నారు. దీని తర్వాత షాహిద్ హీరోగా నెట్ ఫ్లిక్స్ కోసం మరో భారీ సిరీస్ చేయబోతున్నారట.