ఇటీవలే చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అభిమానులు కాని వాళ్ళు సైతం షాక్ తిన్నారు. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెట్టారు. మైకు పట్టుకున్నప్పుడు వణుకుతున్న తన చేతులు చూసి ఏదో పెద్ద సమస్యే అంటూ కోలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. మోహంలో కళ తగ్గిపోయి నవ్వులో జీవం లేనట్టుగా అనిపించిన విశాల్ పడిన తీవ్ర ఇబ్బంది కెమెరా సాక్షిగా బయట పడింది. సినిమాకు పని చూసినవాళ్లందరూ ఉత్సాహంగా మాట్లాడితే విశాల్ ఒక్కటే తడబడుతూ ప్రసంగించాడు. బయట ప్రచారం కాస్త ఎక్కువైపోవడంతో అసలు నిజాలు బయటికి వచ్చాయి.
విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. అక్కడే చికిత్స తీసుకుంటూ ఉండగా 12 సంవత్సరాల తర్వాత మదగజరాజ రిలీజవుతున్న సంగతి తెలిసి హుటాహుటిన చెన్నై వచ్చాడు. అప్పటికింకా కోలుకోలేదు. తీరా ఈవెంట్ లో పాల్గొన్నాక అది మరింత ఎక్కువయ్యింది. ఇది గమనించిన ఖుష్బూ, సుందర్ సి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లక అక్కడ క్రమంగా కోలుకుంటున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈలోగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్టోరీలు వండేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కొంత ఎక్కువ రెస్ట్ అవసరం ఉండటంతో విశాల్ మరికొన్నాళ్లు బయట కనిపించకపోవచ్చు. డాక్టర్ల సలహా కూడా ఇదే.
ఇదంతా ఖుష్బూ స్వయంగా పంచుకున్నారు. జనవరి 12 విడుదలవుతున్న మదగజరాజకు అనూహ్యంగా మద్దతు దొరుకుతోంది. అంత పాత సినిమాని జనం పట్టించుకుంటరానే అనుమానాలకు భిన్నంగా విశాల్, సంతానం కామెడీని ఎంజాయ్ చేసేందుకు ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పడం గమనార్హం. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి సుందర్ సి దర్శకుడు. హీరోయిన్లు వరలక్ష్మి శరత్ కుమార్, అంజలిలు మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కు దూరంగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ తో పాటు మరో ఆరేడు సినిమాలతో మదగజరాజకు పెద్ద పోటీనే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates