వింటేజ్ వెంకీని తెలివిగా వాడుకున్నారు

జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకి సంబంధించిన ఏ చిన్న అంశాన్ని వదలకుండా పబ్లిసిటీ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకుంటున్న జాగ్రత్తలు హైప్ ని పై స్థాయికి తీసుకెళ్తున్నాయి. బడ్జెట్, స్కేల్ పరంగా పండగ సినిమాల్లో చివరిగా ఉన్నది కాస్తా ఇప్పుడు గట్టి పోటీ అనుకునే దాకా వచ్చింది.

థియేటర్లు తక్కువగా ఉన్న కొన్ని సి సెంటర్లలో ఇది కూడా కావాలని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐశ్యర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో కలిసి స్టేజి మీద వెంకీ మామ వేసిన స్టెప్పులు హోరెత్తిపోయాయి.

ఇక్కడితో ఆగలేదు అనిల్ రావిపూడి. పాటల రిలీజ్ టైంలో వెరైటీ ప్రోమోలు కట్ చేయించి వదిలడం బాగా సక్సెస్ కావడంతో ఇప్పుడు రీల్స్ బాట పట్టాడు. వెంకటేష్ క్లాసిక్ సాంగ్స్ ని వాడుకుంటూ ప్రత్యేకంగా షార్ట్ వీడియోస్ చేయించాడు.

ముందు జాగ్రత్తగా షూటింగ్ టైంలోనే చిత్రీకరించి సిద్ధంగా పెట్టుకోవడం ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడో సూర్య ఐపీఎస్ లోని ఇళయరాజా పాటని చిన్న బిట్ గా షూట్ చేయడం అనిల్ టేస్ట్ కి నిదర్శనం. ఇంతకు ముందు బొబ్బిలిరాజా, జయం మనదేరా, చంటి గెటప్స్ ని టీమ్ తో వేయించి చేసిన ఇంటర్వ్యూ ముందు ట్రోలింగ్ అయినా తర్వాత సూపర్ హిట్ కొట్టింది.

ఇంతగా వింటేజ్ వెంకటేష్ ని వాడుకున్న దర్శకులు ఈ మధ్య కాలంలో లేరు. ఎఫ్2, ఎఫ్ 3 టైంలోనూ ఇంత క్రియేటివిటీ చూపించలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రమోషన్లు డిజైన్ చేసిన విధానం మంచి ఫలితాలు ఇస్తోంది. పండగ బరిలో చివరిగా దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం కన్నా ముందే డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ టాక్స్ వచ్చేస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా అప్పటికప్పుడు ప్లానింగ్ మార్చుకునే వెసులుబాటు వెంకీ టీమ్ కు ఉంది.

నిన్న వచ్చిన ట్రైలర్ కి స్పందన బాగుంది. ఇంకో వారం పాటు ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఇలాంటి రీల్స్, వీడియోలు, ప్రోమోలు బోలెడు రాబోతున్నాయట.