కోలీవుడ్ హీరో సూర్య కొండంత ఆశలతో రెండేళ్లకు పైగా విలువైన సమయాన్ని కేటాయించి చేసిన ప్యాన్ ఇండియా మూవీ కంగువ ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పిన మాటలకు పొంతన లేకుండా కనీసం అందులో పదో వంతు కూడా వసూలు చేయలేక చేతులు ఎత్తేసింది.
కార్తీ క్యామియో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, దిశా పటాని గ్లామర్, సూర్య డ్యూయల్ రోల్ ఇవేవి కాపాడకపోయాయి. ఫ్యాన్స్ వీలైనంత త్వరగా దీన్ని మర్చిపోవాలని భావించారు. ఊహించని తాజా షాక్ ఏంటంటే ఆస్కార్ బెస్ట్ పిక్చర్ నామినేషన్ల ఎలిజిబుల్ లిస్ట్ లో కంగువకు చోటు దక్కడం.
నామినేషన్లకు అర్హత ఉన్నంత మాత్రాన అవార్డు వచ్చినట్టు కాదు కానీ ఆ మాత్రం సాధించడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రేక్షకుల మెప్పు పొందలేక కమర్షియల్ ఫెయిల్యూర్ అయిన సినిమా ఇక్కడి దాకా వెళ్లడమే గొప్ప.
కథా కథనాలు పక్కనపెడితే అందులో చూపించిన దశాబ్దాల వెనుకటి అటవీ ప్రపంచం, వివిధ తెగలకు సంబందించిన నేపధ్యాలు, విజువల్ ఎఫెక్ట్స్ బహుశా ఆ లిస్టులో చోటు దక్కించుకునేందుకు అవకాశం కలిగించి ఉండొచ్చు. అయినా చాలా హాలీవుడ్ సినిమాలు మనకు నచ్చనివి, కనెక్ట్ కానివి ఆస్కార్ సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోణంలో చూస్తే ఓకే అనుకోవచ్చు.
కంగువ గాయం నుంచి బయటపడిన సూర్య ప్రస్తుతం రెట్రో చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ కం లవ్ డ్రామా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 10 విడుదల చేయాలనే ఆలోచన జరుగుతోంది కానీ ఇంకా ఫైనల్ చేయలేదు.
ఆర్జె బాలాజీ డైరెక్షన్లో ఫాంటసీ మూవీ చేస్తున్న సూర్య ఆ తర్వాత వెట్రిమారన్ వడివాసల్ లో జాయినవుతాడు. అన్నట్టు కంగువతో పాటు నామినేషన్ ఎలిజిబిలిటీ లిస్టులో ఇండియా నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్, సుచి తలాటి రూపొందించిన గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఉన్నాయి.