ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, నటీనటులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో.. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌తో వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.
బాలీవుడ్ కొన్నేళ్లుగా బాంద్రా-జుహు మధ్య స్ట్రక్ అయిపోయిందని.. టాలీవుడ్ మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి భారీ హిట్లతో దూసుకెళ్తోందని.. పుష్ప-2 ఒక్క రోజులో 86 కోట్ల వసూళ్లు సాధించిన రోజు బాలీవుడ్ వాళ్లెవ్వరికీ నిద్ర పట్టి ఉండదని వ్యాఖ్యానించాడు నాగవంశీ. ఈ వ్యాఖ్యలు కొంచెం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ ఫిలిం మేకర్స్.. నాగవంశీ మీద ఆన్ లైన్ లో యుద్ధం ప్రకటించారు. సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా తదితరులు నాగవంశీ మీద విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలపై ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ వివరణ ఇచ్చాడు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని అతనన్నాడు.
తాను గత కొన్నేళ్లుగా ఏం జరుగుతోందన్నది మాత్రమే వివరించానని నాగవంశీ స్పష్టం చేశాడు. అంతకుమించి ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని తాను మాట్లాడలేదని అన్నాడు. తాను షారుఖ్ ఖాన్‌కు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పిన నాగవంశీ.. రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలను కూడా అమితంగా అభిమానిస్తానని చెప్పాడు. తనకు నిర్మాత కావడానికి పెద్ద ఇన్‌స్పిరేషనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అని అతను తెలిపాడు.
దర్శకుడిగా కరణ్ తొలి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా’ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యానని.. ఎప్పటికైనా ఇంత రిచ్‌గా, ఆకర్షణీయంగా సినిమా తీయాలి అనే ఫాంటసీ తనలో ఏర్పడిందని.. అలాంటిది తాను బాలీవుడ్‌ను కావాలని కించపరచడం లాంటిది ఏమీ లేదని నాగవంశీ స్పష్టం చేశాడు.