విడుదల ఇంకో నాలుగు రోజుల్లో ఉందనగా తమిళ గేమ్ ఛేంజర్ కు కొత్త సమస్యలు వస్తున్నట్టు చెన్నై అప్డేట్. ఇండియన్ 3 పూర్తి చేయకుండానే వేరే సినిమాకు వెళ్లిపోవడాన్ని అపేక్షేపిస్తూ లైకా సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని ఆశ్రయించి ఆ రాష్ట్రంలో రిలీజ్ ఆపాలని కోరుతున్నట్టుగా బయటికొచ్చిన వార్త సంచలనం రేపుతోంది.
నిజానికి ఇండియన్ 2 టైంలోనే దర్శకుడు శంకర్ ఈ సమస్యని ఎదుర్కొన్నారు. అందుకే రెండు సమాంతరంగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో వివాదం కాలేదు. కమల్ హాసన్ చిత్రమే ముందు వచ్చింది కాబట్టి అక్కడితో చిక్కులు విడిపోయినట్టేనని అందరూ అనుకున్నారు.
తీరా చూస్తే ఇప్పుడీ పరిణామం షాక్ ఇచ్చేలా ఉంది. అయితే శంకర్ తగిన వివరణ ఇస్తున్నారట. ఇండియన్ 3 ఇంకొంత భాగమే బ్యాలన్స్ ఉందని, ఖచ్చితంగా అనుకున్న టైంలోనే పూర్తి చేసి ఇస్తానని హామీ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కాంట్రావర్సి వల్లే ఇప్పటిదాకా తమిళనాడు ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుకాలేదని తెలిసింది. కానీ గేమ్ ఛేంజర్ టీం ఇది సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకం కలుగజేయదు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ల కేటాయింపు, డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందాలు దాదాపుగా అయిపోయాయి. 400కి పైగా స్క్రీన్లు కేటాయిస్తున్నట్టు బయ్యర్ల వర్గాల రిపోర్ట్. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంత కౌంట్ రావడం వెనుక చరణ్ ఇమేజ్, శంకర్ బ్రాండ్ బాగా ఉపయోగపడ్డాయి. ఇవన్నీ అనఫీషియల్ టాక్సే.
వీలైనంత త్వరగా ఇది పరిష్కారం దిశగా వెళ్లడం మంచిది. అసలే దిల్ రాజు ఇక్కడ ఈవెంట్లు, బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. తమిళ హక్కులు వేరొకరు తీసుకుని చూసుకున్నప్పటికీ ఒకవేళ వాయిదా లాంటిది జరిగితే నష్టం తీవ్రంగా ఉంటుంది.
కోలీవుడ్ విశ్లేషకులు మాత్రం గేమ్ ఛేంజర్ కు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని అంటున్నారు. శంకర్ తో రాతపూర్వక ఒప్పందం తీసుకుని రూట్ క్లియర్ చేస్తారని, ఇండియన్ 3 ఎప్పుడు ఫినిష్ చేస్తారనే దాని మీద స్పష్టత తీసుకుని ముగించేస్తారని అంటున్నారు. థ్రిల్లర్ మూవీలో ట్విస్ట్ లాగా హఠాత్తుగా ఊడిపడ్డ ఈ మలుపు ఎక్కడ ముగుస్తుందో.