గేమ్ ఛేంజర్ నెగిటివిటీ : దిల్ రాజు కాన్ఫిడెన్స్!

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను నిర్మించి రిలీజ్ చేయడంతో పాటు మరో భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్ రాజుకు వీటి వ్యవహారాలతో మాములు ఒత్తిడి ఉండటం లేదు. అయినా సరే బ్యాలన్స్ తప్పకుండా వాటిని ప్రశాంతంగా ప్లాన్ చేసుకుంటున్న తీరు ఎక్కడా అపశ్రుతి లేకుండా చూసుకుంటోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ నిర్మాతగా తనకు, దర్శకుడిగా ఖచ్చితంగా కంబ్యాక్ అవుతుందనే నమ్మకాన్ని ధీమాగా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన నెగటివిటీని ప్రస్తావించి వివరణ ఇచ్చారు.

ఇండియన్ 2 ఫలితం, శంకర్ ఇప్పుడు ఎలాంటి సినిమా ఇస్తాడోననే అనుమానాలు, జడ్జ్ మెంట్ తప్పుతున్న ప్రొడ్యూసర్ గా తన మీద వస్తున్న కామెంట్లు అన్నీ తెలుసని, కానీ గేమ్ ఛేంజర్ విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వాటిని సమూలంగా తుడిచిపెడుతుందని కుండబద్దలు కొట్టేశారు.

రిలీజ్ కు ముందు గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఒక్క హీరో గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల మీద జనంలో ఆసక్తి కనిపించేది కాదని ఇప్పుడు మొత్తం మారిపోయిందని, ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీని పండగ కానుకగా ఇస్తున్నామని, విజిల్స్ వేయించే బోలెడు కంటెంట్ చూస్తారని నమ్మకంగా చెప్పారు.

సో మెగా ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంని నిన్నే చూశానని చెప్పిన దిల్ రాజు సూపర్ హిట్ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ వచ్చిందని అన్నారు. డాకు మహారాజ్ తమ ప్రొడక్షన్ కాకపోయినా సితార స్వంత కంపెనీలాంటిదని, నాగవంశీ, చినబాబు తన కుటుంబ సభ్యులేనని, సమన్యాయం విషయంలో వెనక్కు తగ్గడం ఉండదని థియేటర్ల పంపకం గురించి చెప్పుకొచ్చారు.

అందుకే రెండు రోజుల గ్యాప్ తో రిలీజులు జరిగేలా ప్లాన్ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన హైప్ తక్కువా ఎక్కువా అనేది పక్కనపెడితే గేమ్ ఛేంజర్ మబ్బులైతే తొలగిపోయాయి.