అన్ స్టాపబుల్ సీజన్ 4 మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే బయట ఎంతో ఆత్మీయంగా పలరించుకునే బాలకృష్ణ, రామ్ చరణ్ మధ్య ఎలాంటి ముచ్చట్లు చోటు చేసుకుంటాయోననే ఆసక్తి సగటు ప్రేక్షకుల్లో ఉంది.
దాన్ని మరింత పెంచేందుకు నాలుగున్నర నిమిషాల ట్రైలర్ ని వదిలి కబుర్లు ఎలా ఉండబోతున్నాయో శాంపిల్ ఇచ్చేశారు. బోనస్ గా శర్వానంద్, యువి క్రియేషన్స్ విక్రమ్, దిల్ రాజు హాజరై తమ ఫ్రెండ్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు పంచుకున్న క్లూస్ ఇచ్చారు. బాగా సరదాగా జరిగినట్టు అర్థమైపోయింది.
అంచనాలు పెరిగేందుకు కొన్ని అంశాలు దోహదం చేశాయి. చరణ్ ముద్దుల కూతుర్ని అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తారు, ప్రభాస్ ఫోన్ కాల్ లో ప్రతీకారం ఎలా తీరింది. పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా ఇష్టమా లేక రాజకీయ నాయకుడిగా ఇష్టమా.
క్లింకారా పెంపకంలో మెగా పవర్ స్టార్ తీసుకుంటున్న శ్రద్ధ గురించి కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, కొత్త సంవత్సరంలో ఏం కానుక అడిగారు లాంటివి ఎన్నో ఇందులో పొందుపరిచారు. మెగా ఫ్యామిలీ స్టార్ అంటూ బాలయ్య చరణ్ ని కొత్తగా సంబోధించడం, అందరితో కలిసి చివర్లో అన్ ప్రిడిక్టబుల్ అంటూ సిగ్నేచర్ స్టిల్ ఇవ్వడం బాగుంది.
గత సీజన్లలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ కి వచ్చిన భారీ రెస్పాన్స్ మించి దీనికి స్పందన ఉంటుందని ఆహా ఆశిస్తోంది. అందులోనూ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పరస్పరం తలపడుతున్నాయి. కేవలం రెండు రోజుల గ్యాప్ లో థియేటర్ల దగ్గరా నువ్వా నేనాని క్లాష్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్ వ్యూస్ పరంగా రికార్డు సృష్టించడం ఖాయం. బుధవారం సాయంత్రం ఏడు గంటలకు టైం చెప్పేశారు కాబట్టి ఫ్యాన్స్ త్వరగా స్ట్రీమింగ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఎపిసోడ్స్ తో అన్ స్టాపబుల్ 4ని త్వరలో క్లైమాక్స్ కు తేబోతున్నారు.