పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ రన్ ముగింపుకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్ 5 విడుదలైన తేదీ నుంచి ఇప్పటిదాకా ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో ఇండస్ట్రీ టాపిక్ గా నిలుస్తున్న ఈ ఆల్ టైం బ్లాక్ బస్టర్ తాజాగా బుక్ మై షోలో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ ఒక్క యాప్ / వెబ్ సైట్ ద్వారా పుష్ప 2 ఏకంగా 20 మిలియన్లు అంటే 2 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటిదాకా ఈ ఘనత బాహుబలి 2 (15 మిలియన్లకు పైగా) పేరు మీద ఉండగా దాన్ని అల్లు అర్జున్ – సుకుమార్ తీసేసుకున్నారు. ఇంకో వారం పది రోజులు వీకెండ్స్ జోరు కొనసాగనుంది.
ఇక్కడ ఇంకో ప్రత్యేకత గురించి మాట్లాడుకోవాలి. పుష్ప 2 విడుదల సమయంలో జొమాటో స్థాపించిన డిస్ట్రిక్ట్ అనే కొత్త టికెటింగ్ పార్ట్ నర్ ని అధికారికంగా తీసుకొచ్చారు. చాలా నగరాలు, పట్టణాల థియేటర్ల ఆన్ లైన్ బుకింగ్స్ కేవలం పేటీఎం ద్వారానే జరిగేవి. అవన్నీ డిస్ట్రిక్ట్ కి మారిపోవడంతో ఒక్కసారిగా లక్షలాది ప్రేక్షకులు ఆ యాప్ ని ఇన్స్ టాల్ చేసుకుని టికెట్లు కొన్నారు.
అంటే ఇంత పోటీలోనూ బుక్ మై షోలో పుష్ప 2 రెండు కోట్ల టికెట్లు అమ్మడం ఆషామాషీ కాదు. సగటున ఒక టికెట్ కమీషన్ 30 రూపాయలు వేసుకున్నా వాటి ద్వారా వచ్చిన ఆదాయమే 60 కోట్లంటే ఇంతకన్నా చెప్పేందుకు ఏముంది.
కేవలం పుష్ప 2 ద్వారా బుక్ మై షో ఇంత ఆదాయం ఆర్జించిందన్న మాట. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడమంటే అంత సులభం కాదు. కల్కి 2898 ఏడి సైతం భారీ నెంబర్లు నమోదు చేసింది కానీ బాహుబలి 2ని దాటలేదు. కానీ పుష్పరాజ్ సాధించాడు.
ఇందులో సింహ భాగం నార్త్ ఆడియన్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఊహించిన దానికన్నా చాలా భారీగా ఉత్తరాది రాష్ట్రాల ప్రేక్షకులు ఎగబడి చూశారు. ముంబై నుంచి బీహార్ లోని చిన్న ఊళ్ళ దాకా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. మళ్ళీ ఈ రికార్డుని తిరగరాయాలంటే ఇంకో టాలీవుడ్ మూవీ వల్లే సాధ్యమవుతుందేమో. తెలుగోడి సత్తా అంటే అదే.