అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయగా..ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కొద్ది రోజుల క్రితం వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది.

రూ.50 వేల రూపాయల సొంత పూచీకత్తుతోపాటు రెండు సాక్షి సంతకాలతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది.

కాగా, ఈ కేసులో ‘పుష్ప-2’ నిర్మాతలకు కూడా ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిర్మాతలను నిందించవద్దు అని కోర్టు తేల్చి చెప్పింది. వారిని అరెస్ట్ చేయొద్దని ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. దీనికి కౌంటర్‌గా పోలీసులను ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.