వరుస ఫ్లాపులు.. అయినా చేతిలో 4 సినిమాలు

టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు దక్కింది. బెల్లంకొండ సురేష్ పెద్ద హీరోల సినిమాల స్థాయిలో భారీ బడ్జెట్ పెట్టి ‘అల్లుడు శీను’ తీసి కొడుకుని ఘనంగా డెబ్యూ చేయించాడు. ఆ తర్వాత కూడా జయ జానకి నాయక, సాక్ష్యం లాంటి పెద్ద బడ్ెట్ సినిమాలు చేశాడు శ్రీనివాస్. వీటితో కొంచెం పేరు, మార్కెట్ వచ్చాయి కానీ.. వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. తెలుగులో తన చివరి చిత్రం ‘అల్లుడు అదుర్స్’ డిజాస్టర్ అయింది.

హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తే అది ఇంకా చేదు అనుభవాన్ని మిగుల్చుకుంది. ఛత్రపతి రీమేక్ వల్ల తెలుగులో చాలా గ్యాప్ కూడా వచ్చేసింది శ్రీనివాస్‌కు. అయితే హిట్టు కొట్టి చాలా కాలం అయినా, చాలా గ్యాప్ వచ్చినా.. బెల్లంకొండ వారసుడి కెరీర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఇలాంటి సమయంలో కూడా చేతిలో నాలుగు ప్రాజెక్టులు పెట్టుకున్నాడతను. ఈ రోజు శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఆ సినిమాల పోస్టర్లతో తనకు శుభాకాంక్షలు చెప్పాయి టీమ్స్.

‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ చంద్రతో ‘టైసన్ నాయుడు’ పేరుతో శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల దీని రిలీజ్ ఆలస్యం అవుతోంది. కుదిరితే ఫిబ్రవరిలో.. లేదంటే వేసవిలో దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో పాటు తమిళ రీమేక్ అయిన ‘భైరవం’ చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజైంది.

వీటితో పాటు కొత్తగా శ్రీనివాస్ హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. ఇందులో 400 ఏళ్ల నాటి ఓ గుడి నేపథ్యంలో సాగే మిస్టిక్ థ్రిల్లర్ ఒకటి కాగా.. మరొకటి యాక్షన్ సినిమా. వీటిని కొత్త దర్శకులు నిర్మిస్తున్నారు. ఓ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్త ప్రొడ్యూస్ చేస్తోంది. ‘టైసన్ నాయుడు’ను కూడా 14 రీల్స్ లాంటి పేరున్న ప్రొడక్షన్ హౌసే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాప్ వస్తే వచ్చింది కానీ.. ఈ ఏడాది మాత్రం శ్రీనివాస్ పేరు గట్టిగానే వినిపించేలా కనిపిస్తోంది.