మొదటి పరీక్ష గెలిచిన శంకర్

గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ, స్నేహితుడు లాంటి ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా విమర్శలు తక్కువే కానీ టెక్నీషియన్ గా ఆయన అపారమైన మేధాశక్తి అంటే అందరికీ గౌరవమే. నిన్న రాజమౌళి మాటల్లో బయట పడింది ఇదే. కానీ 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ తీయాలనే తొందరపాటులో కథా కథనాలు సరిగా కుదిరాయో లేదో చూసుకోకుండా వందల కోట్లు ఖర్చు పెట్టేయడం వల్ల దారుణమైన ఫలితం దక్కింది. దాని ప్రభావం గేమ్ ఛేంజర్ మీద ఎక్కడ పడుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడిన మాట వాస్తవం.

కానీ ఇప్పుడా ఆందోళన అక్కర్లేదు. నిన్న ట్రైలర్ చూశాక సందేహాలు తీరిపోయాయి. మరీ బాహుబలి రేంజ్ లో ఎక్స్ ట్రాడినరి అనలేం కానీ ఒక కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి ఏమేం ఆశిస్తామో అవన్నీ శంకర్ పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసినట్టు అర్థమయ్యింది. కోలీవుడ్ మీడియాలోనూ గేమ్ ఛేంజర్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం విశేషం. ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్ నాటి శంకర్ గుర్తుకు వచ్చారని ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ హీరోగా రామ్ చరణ్ కు తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడీ గేమ్ ఛేంజర్ కంటెంట్ కనక క్లిక్ అయితే అక్కడ మార్కెట్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

అసలు భారతీయుడు 3కి బజ్ రావాలన్నా, బిజినెస్ జరగాలన్నా గేమ్ ఛేంజర్ బ్రహ్మాండంగా ఆడి తీరాలి. శంకర్ మాటల్లో ఆ నమ్మకం కనిపిస్తోంది. ఒక్కడు, పోకిరి లాంటి మాస్ బ్లాక్ బస్టర్స్ తీయాలనే కోరిక ఇప్పుడు తీరిందని చెప్పడం చూస్తే మాములు ఎలివేషన్ అనిపించడం లేదు. పైగా చరణ్ పెర్ఫార్మన్స్ గురించి పదే పదే పొగిడిన వైనం అంచనాలు పెంచుతోంది. ట్రైలర్ వల్ల తమిళ వెర్షన్ కు ఎంత పోటీ ఉన్నా సరే మంచి ఓపెనింగ్స్ వస్తాయని బయ్యర్లు లెక్కలేస్తున్నారు. ప్రస్తుతానికి శాంపిల్ లో కనిపిస్తున్న వింటేజ్ శంకర్ సినిమా మొత్తంలోనూ ఉంటే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయం.