ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న డైరెక్టర్ కాంబోలో మూవీ ఏకంగా దశాబ్దం పైగా థియేటర్లకు రాకుండా ఆగిపోయిందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 2012లో విశాల్ తో దర్శకుడు సుందర్ సి ‘మదగజరాజా’ తీశారు. ఏడాదికే షూటింగ్ పూర్తయ్యింది. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చాడు. కానీ ఏవేవో కారణాల వల్ల ప్రింట్లు బయటికి రాలేదు. నిర్మాతలు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. విశాల్ మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఇలా జరగడం అభిమానులను కలవరపరిచింది.
సరే అందరూ దాన్ని మర్చిపోయారనుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మదగజరాజకు మోక్షం దక్కింది. జనవరి 12 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అజిత్ విడాముయార్చి వాయిదా వేసుకోవడంతో ఒక్కసారిగా తమిళ నిర్మాతలు పొంగల్ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. సుమారు డజను సినిమాలు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. మదగజరాజకు కొన్ని సానుకూలంశాలు ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లు. మెయిన్ కమెడియన్ గా సంతానం నటించాడు. బాక్ అరణ్మయి 4తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన సుందర్ బ్రాండ్ బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది.
తెలుగులోనూ గతంలో ఇలా ఆలస్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి కానీ మరీ ఇంత గ్యాప్ తో వచ్చినవి అయితే తక్కువ. మదగజరాజని డబ్బింగ్ చేసే అవకాశాలు దాదాపు లేనట్టే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ, సంక్రాంతికి వస్తున్నాంని తట్టుకుని నిలబడటం కష్టం. విశాల్ సరసన ముందు శృతి హాసన్, హన్సిక, కార్తీక, తాప్సిను అనుకుని తర్వాత కాంబినేషన్లు మార్చేశారు. కథ కూడా ఎన్నోసార్లు మారిపోయింది. ముందు ట్రిపుల్ రోల్ అనుకుని తర్వాత ఒక్క పాత్రకే విశాల్ ని పరిమితం చేశారు. ఇన్ని పురిటినొప్పులు పడిన మదగజరాజ మీద మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఆ స్థాయిలో ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates