రవి బస్రూర్ పేరు మళ్ళీ వినిపిస్తోంది

కెజిఎఫ్ తర్వాత దక్షిణాది సంగీతంలో మారుమ్రోగిపోయిన పేరు రవి బస్రూర్. భారీ యాక్షన్ డ్రామాకు ఎలాంటి బీజీఎమ్ ఇస్తే ఎలివేషన్ పండుతుందో అంతకు మించి అతనిచ్చిన స్కోర్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లోనూ తన సౌండ్ బాగా వర్కౌట్ అయ్యింది. రెండే పాటలున్నా ఆకట్టుకున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ కు తప్ప రవి నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ రావడం లేదన్నది మ్యూజిక్ లవర్స్ గత కొంత కాలంగా చేస్తున్న కంప్లయింట్. దానికి తగ్గట్టే కబ్జా, మార్టిన్, భీమా లాంటివి తీవ్రంగా నిరాశపరిచాయి. జీబ్రా సైతం జస్ట్ పర్వాలేదనిపించింది.

ఇప్పుడు మార్కో పుణ్యమాని రవి బస్రూర్ పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఒక మాములు గ్యాంగ్ స్టర్ రివెంజ్ డ్రామాకు ఇతనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమైన ప్రశంసలు తీసుకొచ్చింది. దర్శకుడు ఎంత స్టైలిష్ మేకింగ్ తో తీసినా దానికి అనుగుణంగా సంగీతం లేకపోతే స్క్రీన్ మీద తేడా కొట్టేస్తుంది. మార్కోలో ప్లస్ అయ్యింది ఇదే. విలన్ గ్యాంగ్ కు సైతం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ట్యూన్ కంపోజ్ చేయడమంటే మాటలు కాదు. తన రొటీన్ స్టయిల్ ని పక్కనపెట్టేసి కథలో ఇంటెన్సిటీని అర్థం చేసుకుని మరీ పని చేయడం ఓ రేంజ్ లో పేలింది. మొత్తానికి మరో బ్లాక్ బస్టర్ ఇతని ఖాతాలో పడింది.

ఈ ఫలితం పట్ల ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వార్ 2 తర్వాత తారక్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ దే. దేవరకు అనిరుద్ రవిచందర్ ఎంత ఉపయోగపడ్డాడో చూశాం. ఇప్పుడదే తరహాలో రవి బస్రూర్ పనితనం ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ ఈ నెల లేదా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ కాలియన్ కు రవి బస్రూరే సంగీతం సమకూరుస్తున్నాడు. తనో మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలని ఫ్యాన్స్ కోరిక.