కంగ‌నా‌కు సింగ‌పూర్ ఎలా వెళ్లాలో తెలియ‌క‌..

Kangana
Kangana Ranaut

స్టార్ ఇమేజ్, మార్కెట్, యాక్టింగ్ టాలెంట్, ఫాలోయింగ్.. ఇవ‌న్నీ లెక్క‌గ‌ట్టి చూస్తే ప్ర‌స్తుతం బాలీవుడ్లో కంగ‌నా ర‌నౌతే నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అని ఒప్పుకోవాలి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వంద కోట్ల‌కు అటు ఇటుగా వ‌సూళ్లు సాధించే రేంజికి వెళ్లాయంటే త‌న స్థాయి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. రైటింగ్, డైరెక్ష‌న్లోనూ త‌న ప్ర‌తిభ చాటుకుని ఇంకా రేంజి పెంచుకుంది కంగ‌నా.

ఐతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న కంగ‌నా ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఎన్నో అవ‌స్థ‌లు ప‌డింది. ఎలాంటి బ్యాక‌ప్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఆమె.. తొలి నాళ్ల‌లో స‌పోర్ట్ లేక ఇబ్బంది ప‌డింది. తాను క‌థానాయిక‌గా న‌టించిన తొలి సినిమాకు ఉత్త‌మ న‌టిగా అవార్డు వ‌స్తే.. అది తీసుకోవ‌డానికి సింగ‌పూర్‌కు వెళ్లే మార్గం కూడా తెలియ‌లేద‌ట ఆమెకు.

తాను ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తయిన నేప‌థ్యంలో కంగనా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది. తాను క‌థానాయిక‌గా న‌టించిన తొలి సినిమా గ్యాంగ్‌స్ట‌ర్‌లో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ నూత‌న న‌టిగా ఫిలిం ఫేర్ అవార్డు వ‌చ్చింద‌ని.. ఐతే ఆ అవార్డుల వేడుక సింగ‌పూర్లో నిర్వ‌హించ‌డంతో అక్క‌డికి వెళ్ల‌లేక‌పోయాన‌ని ఆమె చెప్పింది.

ఇందుకు కార‌ణం వివ‌రిస్తూ.. “నేను అవార్డుకు నామినేట‌య్యాన‌ని కూడా ముందు నాకు తెలియ‌దు. అవార్డుల కార్య‌క్ర‌మం కోసం సింగ‌పూర్‌కు వ‌స్తావా అని చిత్ర బృందంలోని వారు అడిగారు. కానీ సింగపూర్‌ ఎలా వెళ్లాలో, వెళ్లాక ఎక్కడ ఉండాలో, అసలు టికెట్‌ ధర ఎంతో నాకేమీ తెలియదు. మా చిత్ర బృందంను దీని గురించి అడగటానికి సిగ్గేయడంతో నేను రాలేనని చెప్పేశాను. త‌ర్వాత నాకు అవార్డు వ‌చ్చింద‌ని.. దాన్ని త‌నే స్వీక‌రించాన‌ని మా సినిమాటోగ్రాఫర్‌ బాబీ సింగ్‌ ఫోన్‌ చేసి చెప్పారు. చాలా థ్రిల్ల‌య్యా” అని కంగ‌న వివ‌రించింది.