మార్కో సౌండు మాములుగా లేదు

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ బాలీవుడ్ లో పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికీ చాలా బిసి సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేస్తూ వీకెండ్స్ వస్తే చాలు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తోంది. ఒక డబ్బింగ్ మూవీ ఇరవై రోజుల తర్వాత కూడా ఈ స్థాయిలో ప్రభావం చూపించడం కెజిఎఫ్ వల్లే కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్క బాహుబలి 2కి మాత్రమే సాధ్యమైన ఫీట్లన్నీ పుష్ప 2 చేసేస్తోంది. ఇక్కడితో ఆగకుండా హిందీ నెంబర్ 1 సింహాసనాన్ని దక్కించుకోవడం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. దెబ్బకు మొన్నే రిలీజైన బేబీ జాన్ సైతం బాక్సాఫీస్ వద్ద ఎదురీదాల్సి వచ్చింది. ఇక్కడితో కథ అయిపోలేదు.

మలయాళం డబ్బింగ్ మూవీ మార్కో నార్త్ లో తెగ ఆడేస్తోంది. శుక్రవారం పెద్దగా సౌండ్ చేయకపోయినా మెల్లగా బయటికొచ్చిన పాజిటివ్ టాక్ దావానలంలా ఆడియన్స్ కి చేరి షోలు పెరిగే దాకా వెళ్ళింది. ముంబై, కోల్కతా ఢిల్లీలోని పేరు మోసిన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు బేబీ జాన్ షోలు అమాంతం తగ్గించేసి వాటిని మార్కో, పుష్ప 2కి కేటాయించడం దానికి నిదర్శనం. విపరీతమైన వయొలెన్స్ తో ఫ్యామిలీ జనాలు భయపడేలా ఉన్న మార్కోలో హీరోయిజం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు మాస్ కి మాములుగా ఎక్కట్లేదు. రివెంజ్ డ్రామా కథే అయినప్పటికీ ట్రీట్మెంట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తెలుగులో జనవరి ఒకటిన గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. మొన్నటిదాకా మీడియం రేంజ్ లో ఉన్న హీరో ఉన్ని ముకుందన్ ఒక్కసారిగా మార్కో పుణ్యమాని టాప్ లీగ్ లోకి వచ్చేశాడు. ఎప్పుడూ కంటెంట్ ఆధారిత సినిమాలు తీస్తారని పేరున్న మల్లువుడ్ నుంచి ఇంత హింసాత్మక చిత్రాన్ని ఎవరూ ఊహించలేదు. దర్శకుడు అనీఫ్ అదేని పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. కమర్షియల్ హంగులు, డ్యూయెట్లు లేకుండా ఇలా కూడా తీయొచ్చాని ఒక కొత్త పాఠం నేర్పించాడు. జనవరి 10 దాకా తెలుగులో కూడా చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం వల్ల మార్కోకు టాలీవుడ్ లో కూడా మంచి వెల్కమ్ దక్కినా ఆశ్చర్యం లేదు.