‘ఆర్ఎక్స్’ 100’తో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాతో అతను ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. చాలామంది అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ అతను కోరుకున్నట్లుగా రెండో సినిమా పట్టాలెక్కడానికి బాగా ఆలస్యం అయిపోయింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన రెండేళ్లకు కూడా ఆ సినిమాను మొదలుపెట్టలేకపోయాడు.
‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆ హీరో ఈ హీరో అంటూ లీడ్ రోల్స్ గురించి రకరకాల వార్తలొచ్చాయి. నిర్మాత విషయంలోనూ తర్జనభర్జనలు నడిచాయి. చివరికి శర్వానంద్ ప్రధాన పాత్రలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి రంగం సిద్ధం చేశాడు. ఐతే ఈ మల్టీస్టారర్ మూవీలో ఇంకో కథానాయకుడి పాత్ర కూడా ఉంది. దానికి తమిళ నటుడు సిద్ధార్థ్ ఓకే అయిన సంగతి తెలిసిందే.
అజయ్ భూపతి-శర్వానంద్ కాంబినేషన్ అంటేనే ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందనే ఒక అంచనా ఏర్పడింది. వీళ్లకు సిద్దార్థ్ కూడా తోడవడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి అదితిరావు హైదరి కూడా వచ్చింది. ‘సమ్మోహనం’ దగ్గర్నుంచి అదితి సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఆమె నుంచి ప్రేక్షకులు చాలానే ఆశిస్తున్నారు. శర్వా-సిద్ధు-అదితి.. ఈ ముగ్గురి కలయిక భిన్నమైందే.
సినిమా ఆలస్యమైతే అయ్యింది కానీ.. ఆసక్తికర కాంబినేషన్ కుదిరింది. అతి త్వరలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. కొత్త నటీనటుల్ని పెట్టుకుని, పరిమిత బడ్జెట్లో, ఏమాత్రం అంచనాల్లేకుండా ‘ఆర్ఎక్స్ 100’ తీసి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు మంచి కాస్టింగ్, కోరుకున్న బడ్జెట్ అన్నీ కుదిరిన నేపథ్యంలో అతను ఎలాంటి ఔట్ పుట్ అందిస్తాడన్నది ఆసక్తికరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates