ఆర్ఆర్ఆర్ : మేకింగ్ అఫ్ మాస్టర్ పీస్!

ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం. అందులోనూ ఓటిటిలో వచ్చాక జనాలు లైట్ తీసుకుంటారు. కానీ రెండేళ్ల క్రితం ఆడేసి వెళ్ళిపోయిన తన సినిమా గురించి మళ్ళీ మళ్ళీ ఆసక్తి రేకెత్తించేలా చేయడం ఒక్క రాజమౌళికే సాధ్యం. తాజాగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీనే దానికి నిదర్శనం. 1 గంట 38 నిమిషాల నిడివితో ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం థియేటర్లో విడుదలైనా పరిమిత స్క్రీన్లు, టికెట్ రేట్ తదితర కారణాల వల్ల చూడనివాళ్ళు కోట్లలో ఉన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే మేకింగ్ అఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో జక్కన్న చెప్పిన, చెప్పించిన విశేషాలు జరుగుతున్నంత సేపూ కన్నార్పకుండా చూసేలా చేశాయి. వందలాది మందితో దుమ్ము ధూళి మధ్య తీసిన రామ్ చరణ్ ఇంట్రో, రెండు పులులు ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయనిపించేలా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం, నాటు నాటు పాట కంపోజింగ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, జైలులో రామ్ ని భీం తప్పించే ఫైట్, క్లైమాక్స్ అడవిలో చేసే యుద్ధం ఇవన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. వీటి వెనుక సాంకేతిక నిపుణులు పడిన కష్టం వారి మాటల్లోనే మేకింగ్ విజువల్స్ తో పాటు వినిపించడం సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తాయి.

అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది చరణ్, తారక్ బాండింగ్ గురించి. కొమరం భీముడో పాట చిత్రీకరణలో కొరడాతో కొట్టాక చరణ్ అధాటున వెళ్లి తారక్ ని కౌగిలించుకుని గట్టిగా తగిలిందా అంటూ తల్లడిల్లడం, తర్వాత వాతావరణం తేలికగా మారిపోవడం చాలా బాగున్నాయి. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కు బలమైన స్నేహం ఎలా ఉపయోగపడిందనేది పలు షాట్స్ ద్వారా చూపించారు. అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ వెనుక సైతం ఎంత శ్రమ ఉందో చూస్తే కాని అర్థం కాదు. ఎందుకు రాజమౌళిని మాస్టర్ టెల్లర్ అంటారో ఈ డాక్యుమెంటరీ ని మరో సాక్ష్యంగా చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ నచ్చనివాళ్ళను సైతం మెప్పించేలా ఉన్న ఈ మేకింగ్ ఒక అద్భుతమే.