జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా ప్రమోషన్ల కోసం తిరిగాడు. కొత్త పెళ్లి కూతురు కీర్తి సురేష్ మూడు ముళ్ళు వేయించుకున్న మూడో రోజే ప్రమోషన్ల కోసం ముంబై వచ్చేసింది. నిర్మాణ సంస్థ విపరీతంగా ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేసింది. ఎక్కడ చూసినా బేబీ జాన్ గురించే కనిపించేలా, వినిపించేలా హడావిడి జరిగింది. కట్ చేస్తే ఓపెనింగ్స్ నిరాశ పరిచేలా ఉండటం ట్రేడ్ ని షాక్ గురి చేస్తోంది. ప్రాధమిక ట్రేడ్ సమాచారం మేరకు మొదటి రోజు పది కోట్లకు కొంచెం అటుఇటుగా నెట్ వచ్చిందని అంటున్నారు. ఇది ఊహించనిది.
చాలా చోట్ల బేబీ జాన్ కంటే 21వ రోజులో ఉన్న పుష్ప 2 ది రూల్ కే వసూళ్లు ఎక్కువగా ఉండటాన్ని మర్చిపోకూడదు. సల్మాన్ ఖాన్ క్యామియో, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి ఆకర్షణలు ఉన్నప్పటికీ అసలైన కంటెంట్ మరీ మూసగా ఉండటంతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోతోందని పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. వీకెండ్ ఏదోలా నెట్టుకొచ్చినా కూడా స్త్రీ 2, ముంజ్యా, భూల్ భూలయ్యా 3 లాగా లాంగ్ రన్ ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విలన్ జాకీ శ్రోఫ్ పాత్రను ఓవర్ ఎక్స్ ప్లోర్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ కోణంలో మైనస్ అయ్యింది. తేరికి చేసిన కొన్ని మార్పులూ తేడా కొట్టాయి.
విజయ్ స్టైల్ ని వరుణ్ ధావన్ మ్యాచ్ చేయలేకపోయాడనేది వాస్తవం. పైగా కీర్తి సురేష్ పాత్రకు రెండు పాటలు, చావు ట్విస్టు పెట్టడం ఉత్తరాది జనాలకు నచ్చినట్టు లేదు. ఒరిజినల్ వెర్షన్ లోనూ ఇదే ఉంది కానీ ఆ ఎమోషన్ ని దర్శకుడు కలీస్ యధాతథంగా తీసుకురాలేకపోయాడు. ఉన్నంతలో తమన్ బీజీఎమ్ చాలా మటుకు లేచి వెళ్లిపోకుండా నిలబెట్టిందని చెప్పాలి. ఇది ఏ మాత్రం వీక్ ఉన్నా డ్యామేజ్ మరింత పెరిగేది. సల్మాన్ ఖాన్ క్యామియోలు అంతగా అచ్చిరావనే నెగటివ్ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయినట్టే. ఈ లెక్కన పుష్ప 2 ది రూల్ కి హిందీలో మరో రెండు వారాల స్పేస్ దొరికినుంది.