పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో కలీస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎడతెరిపి లేకుండా గత పదిహేను రోజులుగా ప్రమోషన్లు చేస్తూనే వచ్చారు. కీర్తి సురేష్ హీరోయిన్ కావడంతో ఒక లుక్ వేద్దామనుకున్న తెలుగు ఆడియన్స్ లేకపోలేదు. అయితే వరుణ్ ధావన్ ని ఇంత మాస్ రోల్ లో చూడగలమా అనే అనుమానం పలు వర్గాల్లో లేకపోలేదు. ఏదైతేనేం మొత్తానికి హిందీ తెరీ థియేటర్లలో అడుగు పెట్టింది. యునానిమస్ గా హిట్ టాక్ అనిపించుకోలేదు కానీ ఫక్తు కమర్షియల్ మూవీగా విమర్శకులు వర్ణిస్తున్న వైనం రివ్యూలలో కనిపిస్తోంది.
వాళ్ళ సంగతి పక్కనపెడితే తెరీకి కొద్దిపాటి మార్పులు చేసిన అట్లీ ఒరిజినల్ వెర్షన్ నుంచి చాలా సీన్లు, ఎపిసోడ్లు యధాతథంగా తీసుకున్నాడు. గెటప్స్, బిల్డప్స్ లో వ్యత్యాసం తప్పించి మిగిలినదంతా సేమ్ టు సేమ్. అయితే విజయ్ స్వాగ్ ని వరుణ్ ధావన్ మ్యాచ్ చేయలేకపోయాడు. పెర్ఫార్మన్స్ పరంగా ఎంత బాగా నటించినా సెటిల్డ్ హీరోయిజం డిమాండ్ చేసే ఈ కథలో దాన్ని స్టయిలిష్ గా ఇవ్వలేదు. కాకపోతే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వేల్యూస్, సల్మాన్ ఖాన్ క్యామియో గ్రాఫ్ దారుణంగా పడిపోకుండా నిలబెట్టాయి. తేరిని చూసినవాళ్లకు మాత్రం ఈ బేబీ జాన్ లో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు.
సో ఇప్పుడు అలెర్ట్ అవ్వాల్సింది ఉస్తాద్ భగత్ సింగ్ బృందం. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వల్ల వాయిదా పడ్డ ఈ సినిమాను ఇంకో రెండు నెలల్లో రీ స్టార్ట్ చేసే అవకాశముంది. తేరి రీమేక్ కావడం పట్ల ఫ్యాన్స్ కొంత ఆందోళనగా ఉన్నా మార్పులు చేయడంలో మంచి టాలెంట్ ఉన్న హరీష్ శంకర్ దర్శకుడు కావడమే వాళ్లకు రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మిస్టర్ బచ్చన్ ఫలితం తిరిగి టెన్షన్ తెప్పించడం వేరే విషయం. ఏది ఎలా ఉన్నా వరుణ్ ధావన్ వల్ల కానిది పవన్ డబుల్ డోస్ లో చేసి చూపిస్తాడు. కాకపోతే ఎక్కడ పొరపాట్లు చేయకూడదో రిఫరెన్స్ గా వాడుకోవడానికి బేబీ జాన్ ఉపయోగపడుతుంది.