తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు హీరోగా చేసినా ఆ తరువాత కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా చేయలేని పరిస్థితి. పెళ్ళాం డబ్బులతో పదేళ్ళ పాటు గడిపాడు. కొడుకు నుంచి కూడా ‘నాన్న ఇక సినిమాలు చేయరా? డబ్బులు సంపాదించారా?’ అనే సందేహలు. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నరకంగా ఉంటుంది. ఆ విధమైన చేదు అనుభవాలను ఎదుర్కొన్న నటుడు బాబీ డియోల్.
అలాంటి నటుడికి ఒక తెలుగోడు ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమాల్ సినిమాతో బాబీ తలరాతే మారిపోయింది. 15 ఏళ్ళు ఇంట్లోనే గడిపిన బాబీ జీవితం ఆ ఒక్క సినిమాతో బిజీబిజీగా మారిపోయింది. అందుకే ఇప్పుడు అతను ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. డాకు మహరాజ్ లో కూడా విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఇక అతని గురించి ఇలాంటి విషయాలను ఆ చిత్ర దర్శకుడు బాబీ(KS రవీంద్ర) తెలియజేశాడు.
బాబీ డియోల్ సందీప్ పేరు చెబితేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నారట. ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోగా చేసినప్పటికి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఛాన్సుల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చిందట. ఫొటోలు పంపిస్తే అద్భుతంగా ఉన్నాయి అనే వారే కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదట. కానీ ఒక తెలుగోడు వచ్చి తన లైఫ్ ను మార్చేసినట్లు బాబీ చాలా గర్వంగా చెప్పుకుంటున్నట్లు దర్శకుడు రవీంద్ర ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అంతే కాకుండా అతనికి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.