డిసెంబర్ 30 : ఆడబోయే ‘గేమ్’ చాలా కీలకం!

మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్ గా చేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి కిక్ రావడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బడ్జెట్ పరంగా సంక్రాంతి సినిమాల్లో టాప్ ప్లేస్ దీనిదే. ఆ మాటకొస్తే ఇటీవలే ఆల్ ఇండియా రికార్డులు సృష్టించిన పుష్ప 2 కన్నా చరణ్ మూవీకి పెట్టిన ఖర్చు ఎక్కువ. అలాంటప్పుడు బజ్ ఆకాశాన్ని దాటాలి. ఓవర్సీస్ బుకింగ్స్ సరికొత్త బెంచ్ మార్కులు సృష్టించాలి. పాటలు కొంత వరకు ఆ బాధ్యతను నెరవేర్చాయి కానీ తమన్ చెప్పుకున్నంత రేంజ్ లో కాదనేది నెటిజెన్ల ఓపెన్ కామెంట్.

ఇదిలా ఉండగా పబ్లిసిటీలోని కీలక ఘట్టం డిసెంబర్ 30న జరగనుంది. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. వేదిక, అతిథుల వివరాలు ఇంకా రాలేదు కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. టీజర్ కొంచెం హడావిడిగా కట్ చేయడం వల్ల కంటెంట్ ఏ స్థాయిలో ఉందనేది స్పష్టంగా తెలియలేదు. ఇప్పుడు హైప్ పెంచాలంటే ట్రైలర్ బ్రహ్మాండంగా ఉండాలి. ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి చూసి తీరాలనే ఎగ్జైట్ మెంట్ ఇవ్వాలి. ఓపెనింగ్స్ కి ఇది చాలా ముఖ్యం. ఫ్యాన్స్ రావడం సహజమే కానీ కామన్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేది ట్రైలరే.

గెస్టు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. చిరంజీవి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పోటీలో ఉన్న డాకు మహారాజ్ క్రమంగా అటెన్షన్ పెంచుకుంటోంది. నిర్మాత నాగవంశీ మాములుగా ఊరించడం లేదు. ఇంకోవైపు పెద్దగా హడావిడి చేయకుండా సంక్రాంతికి వస్తున్నాంకి భీమ్స్ ఇచ్చిన పాటలు ఖర్చు లేకుండా ప్రమోషన్ పని చేసి పెడుతున్నాయి. ఎటొచ్చి గేమ్ ఛేంజర్ సౌండ్ సరిపోవడం లేదనేది ఫ్యాన్స్ వైపు నుంచి వస్తున్న కంప్లయింట్. వీటన్నింటికి సమాధానం దొరికేది డిసెంబర్ 30. ఆ తర్వాత జనవరి మొదటి వారం పవన్ కళ్యాణ్ అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారని టాక్.