రాజా సాబ్ హీరోయిన్ మాట నమ్మొచ్చా!

వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు కొద్దిరోజులుగా చక్కర్లు కొట్టడం ప్రభాస్ ఫ్యాన్స్ ని అయోమయానికి గురి చేస్తోంది. టీజర్ గురించి జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అప్డేట్ అయితే ఇచ్చింది కానీ ఖచ్చితంగా చెప్పిన డేట్ కే వస్తామని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అనుమానం బలపడింది. ఇది చాలదన్నట్టు సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో రూపొందుతున్న జాక్ రిలీజ్ ఏప్రిల్ 10నే చేయబోతున్నట్టు చెప్పడం కన్ఫ్యూజన్ ని ఇంకా పెంచింది. డార్లింగ్ తో పోటీ పడే రిస్క్ సిద్దు చేయడుగా.

ఇదిలా కొనసాగుతూ ఉండగానే రాజా సాబ్ హీరోయిన్ ఎక్స్ వేదికలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఏప్రిల్ నెలలో తన టాలీవుడ్ డెబ్యూ చూస్తారని చెప్పడం మరో ట్విస్ట్. యథాలాపంగా అన్నదో లేక సమాచారం లేక రిప్లయ్ ఇచ్చిందో తెలియదు కానీ ఇప్పుడప్పుడే ఏదీ నిర్ధారణగా చెప్పలేం. వాస్తవానికి రాజా సాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. హను రాఘవపూడి ఫౌజీ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఎందుకో దానికి ఎక్కువ డేట్లు కేటాయించి వేగంగా పూర్తి చేసేలా ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇటీవలే గాయంతో బ్రేక్ తీసుకున్నాడు. రాజా సాబ్ బ్యాలన్స్ ని తిరిగి జనవరి నుంచి మొదలు పెడతారనే టాక్ ఉంది.

ఒకవేళ పదో తేదీ కాకపోయినా ఏప్రిల్ లోనే మరో డేట్ కి వస్తుందేమో వేచి చూడాలి. కానీ అదే నెలలో మిరాయ్, ఘాటీ, కన్నప్ప లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ క్యూ కట్టాయి. ఒకవేళ రాజా సాబ్ కనక అవి సెట్ చేసుకున్న డేట్ కావాలంటే మిగిలినవి తప్పుకోవచ్చు. ఇవన్నీ కాదు కానీ మే 9కి వెళ్లిందని మరికొందరు అంటున్నారు కానీ అప్పటికే కర్చీఫ్ వేసిన మాస్ మహారాజా మాస్ జాతర ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన రాజా సాబ్ కామెడీ హారర్ జానర్ లో రూపొందింది. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించగా తమన్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి.