వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు మంచి స్పందన దక్కించుకోగా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అంచనాల పరంగా ఫ్యాన్స్ మధ్య ఓ స్థాయిలో హైప్ ఉండగా సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి బాలయ్యకు అండగా ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. నిన్న ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ దర్శకుడు బాబీ చిరంజీవి సినిమా కంటే దీన్ని బాగా తీశాడని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా టీమ్ అంత ధీమాగా ఉండటం వెనుక కొన్ని కారణాలున్నాయి.
డాకు మహారాజ్ బందిపోట్ల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. కరుడుగట్టిన దుర్మార్గుల భరతం పట్టే శక్తివంతమైన పాత్రలో బాలయ్య కనిపిస్తారు. వీళ్ళ మధ్య జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా హైలైట్ చేస్తూ వచ్చిన బాబీ తన సినిమాని జైలర్, విక్రమ్ తో పోల్చడానికి కారణం ఇవేనని సమాచారం. అయితే అసలైన ఎమోషన్ పాప సెంటిమెంట్, శ్రద్ధ శ్రీనాథ్ ఫ్లాష్ బ్యాక్, చాందిని చౌదరి క్యారెక్టర్ లను బాలయ్యతో ముడిపెట్టడం ద్వారా ఓ రేంజ్ లో పండించారని వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్యలో రవితేజ ట్రాక్ ని మరిపించేలా దీన్ని డిజైన్ చేశారట. అయితే బంధాలు ఏంటనేది సస్పెన్స్.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాంతో పోటీ ఎదురుకుంటున్న డాకు మహారాజ్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ అయిపోయింది. రెండో సగం ఇంకో వారంలో కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారు. ఎంత నిడివి అనేది ఇంకా బయటికి రాలేదు. ప్రగ్య జైస్వాల్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్ర పోషించగా టెక్నికల్ గా బాలకృష్ణ సినిమాల్లో గతంలో చూడని స్టాండర్డ్స్ ఇందులో ఉంటాయని వినికిడి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాల తర్వాత మరో విజయం ఇవ్వడానికి డాకు మహారాజ్ రెడీ అవుతున్నాడు. మరి ప్రేక్షకులు ఏం తీర్పిస్తారో.