విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు రాకుండా బయ్యర్లు డీసెంట్ వసూళ్లతో గట్టెక్కినట్టు ట్రేడ్ మాట్లాడుకుంది. తమిళం అంత ఘనవిజయం సాధించకపోయినా సీక్వెల్ మీద టాలీవుడ్ జనాల్లో అంచనాలు పెంచడంలో దర్శకుడు వెట్రిమారన్ సక్సెసయ్యారు. అందుకే విడుదల పార్ట్ 2కి మంచి రిలీజ్ వచ్చేలా చూసుకున్నారు. కానీ తీరా చూస్తే పార్ట్ 2 మంత్రం పని చేసినట్టు కనిపించడం లేదు. మందకొడిగా వస్తున్న కలెక్షన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అర్థం కాని యుఐకే ఎక్కువ ఆదరణ దక్కడం విశేషం.
ఈసారి విడుదల పార్ట్ 2 అంతగా కనెక్ట్ కాకపోవడానికి కారణాలున్నాయి. పార్ట్ 1 తరహాలో ఇందులో డెప్త్ లేదు. డ్రామా సరిపోలేదు. విజయ్ సేతుపతి పోషించిన పెరుమాళ్ జీవితాన్ని డీటెయిల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకోవడం ల్యాగ్ పెంచింది. పైగా మంజు వారియర్ తో ప్రేమకథ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సూరికి ప్రాధాన్యం తగ్గిపోవడం, సుదీర్ఘమైన డైలాగులు, జస్ట్ పర్వాలేదనిపించే ఇళయరాజా సంగీతం, రిపీట్ అనిపించే సీన్లు ఇలా బోలెడు మైనస్సులు అడ్డుపడ్డాయి. క్లాస్ ఆడియన్స్ సంగతి పక్కనపెడితే మాస్ జనాలకు ఎక్కేలా కాన్సెప్ట్ ని డిజైన్ చేయలేకపోవడం దెబ్బ కొట్టింది.
ఫైనల్ గా చెప్పాలంటే విడుదల పార్ట్ 2 కోలీవుడ్ లో జెండా పాతొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం డౌటే. మొదటి వీకెండ్ కూడా సోసోగానే ముగిసింది. కొన్ని బిసి సెంటర్స్ లో అదనంగా ఇచ్చిన స్క్రీన్లను తగ్గించి పుష్ప 2, ముఫాసా, యుఐకి కేటాయించిన వైనం కనిపించింది. అయినా తమిళ నేటివిటీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ దాకా కొట్టొచ్చినట్టు ఆధిపత్యం చెలాయిస్తే తెలుగు పబ్లిక్ కి కనెక్ట్ కావడం కష్టం. దీనికి 2 గంటల 42 నిమిషాల నిడివి ఎక్కువనుకుంటే ఓటిటి వెర్షన్ లో ఎడిట్ చేసి పక్కన పెట్టిన మరో గంట అదనంగా జోడిస్తారట. వెట్రిమారనే స్వయంగా ఈ విషయం చెప్పి షాక్ ఇవ్వడం గమనార్హం.