సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాలని ఆయనకు స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాలకు వడ్డీతో కలిపి తక్షణం ఏపీ ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. దీంతో వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌కు అనుకూలంగా దర్శకుడు వర్మ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఎన్నికలకు ముందు `వ్యూహం`, `శపథం` సినిమాలు తీశారు. అయితే.. ఇవి ప్రజలకు పెద్ద గా ఎక్కలేదు. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా.. ఈ రెండు సినిమాలను విడుదల చేశారు. అప్పుడు కూడా.. వాటిని పెద్దగా ఎవరూ చూడలేదు. కేవలం 1800 మంది మాత్రమే చూశారు. అయితే.. ఇలా సినిమాలు ఫైబర్ నెట్‌లో విడుదల చేసినందుకు ప్రభుత్వం వర్మకు సొమ్ములు చెల్లించింది.
ఇది కోటీ 15 లక్షల రూపాయలుగా ఉందని.. తాజాగా ఫైబర్ నెట్ కొత్త చైర్మన్ జీ వీ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఒక వ్యూ(అంటే ఒకరు చూస్తే) 100 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ, 1800 మంది చూసినా.. కోటీ 15 లక్షల రూపాయలు చెల్లించారు. అంటే.. ఒక్కొక్క వ్యూహకు 11000 చొప్పున ఇచ్చారు. ఇది ఒప్పందాన్ని తోసిపుచ్చడమేనన్నది జీవీ రెడ్డి వాదన.
ఈ క్రమంలో అక్రమంగా తీసుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబట్టేందుకు ఏపీ ఫైబర్ నెట్ దర్శకుడు వర్మకు నోటీసులు జారీ చేసింది. ఈ సొమ్మును కేవలం 15 రోజుల్లోనే వెనక్కి ఇవ్వాలని ఆదేశించడంతో పాటు.. ఏడాదికి 12 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని పేర్కొంది. దీని ప్రకారం.. వడ్డీ కింద మరో 30 లక్షలు వర్మ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మొత్తాన్ని ఏ పద్దు కింద చెల్లించారో కూడా.. విచారణ చేయిస్తామని.. నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే.. వర్మ ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనపై కేసులు ఉన్న విషయం తెలిసిందే.