2024 మెగా ఫ్యామిలీ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం ఆ కుటుంబంలో ఎప్పుడూ లేనంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇక ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో కిక్కిచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మెగా హీరోలను రెగ్యులర్ గా కలుసుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఆయన సినిమా వేడుకకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలకానున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లోనే వేడుకకు ఏర్పాట్లు జరగనున్నట్లు టాక్. అయితే, ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ప్రత్యేక బంధం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని పంచుతోంది. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఈ ఈవెంట్ జనవరి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. చిరంజీవి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారట. ఇక వేడుకలో గేమ్ ఛేంజర్ గురించి పవన్ మాట్లాడితే, సినిమా పట్ల జనాల్లో ఉత్సాహం మరింత పెరిగే అవకాశం ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడిప్పుడే కాస్త సౌండ్ పెంచుకుంటోంది. ఇక పవన్ రాకతో అంచనాల స్థాయి ఇంకా ఏ లెవెల్లో పెరిగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates