తెలుగువాడైనప్పటికీ.. తమిళంలో హీరోగా మంచి స్థాయి అందుకున్న నటుడు విశాల్. హీరోగానే కాక నిర్మాతగానూ అతను విజయవంతమయ్యాడు. కోలీవుడ్ బిగ్ షాట్లలో ఒకడిగా ఎదిగాడు. అక్కడ నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కూడా విశాల్ హవా సాగించాడు. ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. ఐతే ఈ పేరుతో పాటే విశాల్‌కు వివాదాలూ మామూలే.
తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీలో అతను భాగమవుతుంటాడు. ఇటీవల రవీంద్రన్ అనే నిర్మాతతో అతడికి గొడవ మొదలైంది. విశాల్ చివరి సినిమా ‘యాక్షన్’ను నిర్మించింది ఆ నిర్మాతే. ఐతే ఈ సినిమా డిజాస్టర్ అయి ఆ నిర్మాతను ముంచేసింది. దీంతో రవీంద్రన్ కోర్టును ఆశ్రయించాడు. విశాల్ తనకు మాట ఇచ్చి తప్పినందుకు పరిహారం చెల్లించాలని పిటిషన్ వేశాడు.
‘యాక్షన్’ సినిమాను రవీంద్రన్ పరిమిత బడ్జెట్లో నిర్మించాలని అనుకున్నారట. కానీ సినిమా బడ్జెట్ పెంచమని, ఇది కనీసం రూ.20 కోట్లు వసూలు చేస్తుందని, అలా కాని పక్షంలో నష్టం భరించడానికి తాను సిద్ధమని, లేకుంటే తన తర్వాతి సినిమాను అదే బేనర్లో చేస్తానని విశాల్ హామీ ఇచ్చాడట. ఐతే ‘యాక్షన్’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. తమిళనాట రూ.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టి నిర్మాతకు రూ.8 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఐతే ముందు ఇచ్చిన హామీని విశాల్ నెరవేర్చలేదు. పరిహారం ఇవ్వలేదు. తన తర్వాతి సినిమాను ఆ బేనర్లోనూ చేయలేదు. ‘చక్ర’ సినిమా విశాల్ సొంత బేనర్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
దీంతో రవీంద్రన్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు రవీంద్రన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతడికి విశాల్ రూ.8.29 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు విశాల్ చిక్కుల్లో పడ్డాడు.