హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రేవతి తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలుడిని, ఆయన కుటుంబ సభ్యులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ లో పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి కుటుంబ సభ్యులను అల్లు అరవింద్ అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసానిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. అయితే, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అల్లు అర్జున్ ఆసుపత్రికి రాలేకపోయారని, అందుకే అల్లు అర్జున్ తరపున తాను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ చెప్పారు.అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట వంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాలని అల్లు అరవింద్ అన్నారు. అందుకు అవసరమైన భద్రతా చర్యలు నిర్వాహకులు తీసుకోవాలని కోరారు.
విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గరకు భారీ సంఖ్యలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు.భారీ సంఖ్యలో జనం వచ్చే ఈవెంట్లలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగిన ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారని అన్నారు.తాను శ్రీతేజ్ ను స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.