పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న సౌత్ దర్శకుల్లో అట్లీ ఒకడు. రాజా రాణి, తెరి, మెర్శల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్లతో సౌత్‌లో జెండా పాతిన అతను.. షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’తో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రం ఏకంగా 1200 కోట్ల వసూళ్లు రాబట్టడంతో అట్లీ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. దీని తర్వాత అతను చేసే సినిమా మీద చాన్నాళ్ల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో సినిమా గురించి వార్తలు వచ్చాయి కానీ.. అవేవీ నిజం కాలేదు.
మరోవైపు షారుఖ్ ఖాన్ మళ్లీ అట్లీతో ఇంకో సినిమా చేస్తాడన్నారు కానీ.. అది ఇప్పుడే కాదని తెలుస్తోంది. మరి అట్లీ తర్వాతి సినిమాలో హీరో ఎవరు.. ఈసారి అతను సౌత్ సినిమా చేస్తాడా.. పాన్ ఇండియా స్టైల్లోనే ప్రాజెక్టు సెట్ చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే తన కొత్త చిత్రానికి స్క్రిప్టు పూర్తయినట్లు వెల్లడించిన అట్లీ.. ఈ సినిమాకు పని చేసే నటీనటుల విషయంలో ప్రేక్షకులకు షాకవుతారని పేర్కొన్నాడు.
‘‘నా ఆరో సినిమా స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇది ఔట్ ఆఫ్ ద వరల్డ్ కథగా ఉంటుంది. కచ్చితంగా ఇందులో నటీనటులను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరి ఊహలకూ అందని విధంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఈ సినిమా చూసి దేశం గర్విస్తుంది. నటీనటుల ఎంపిక చివరి దశలో ఉంది. త్వరలోనే కాస్టింగ్ గురించి ప్రకటనలో సర్ప్రైజ్ చేస్తాను.
మీ అందరి అభిమానం, ఆశీర్వాదంతో మంచి సినిమాతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నా’’ అని అట్లీ తన కొత్త ప్రాజెక్టు గురించి హైప్ ఇచ్చాడు. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని అంటున్నాడంటే ఇప్పటిదాకా పని చేయని, వేరేే స్టార్‌తోనే అతను సినిమా చేయబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఆ హీరో ఎవరో.. ఈ కథలో అంత ప్రత్యేకత ఏముందో చూడాలి.