కామెడీ, కమర్షియల్, యాక్షన్ ఈ మూడు అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో అనిల్ రావిపూడి శైలే వేరు. టాలీవుడ్ దర్శకుల్లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాప్ ట్రాక్ట్ రికార్డు లేని దర్శకుల్లో తనది రెండో స్థానం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎఫ్2, ఎఫ్3 తర్వాత మరోసారి వెంకటేష్ కాంబినేషన్ రిపీట్ చేయడంతో బిజినెస్ వర్గాల్లోనూ క్రేజ్ నెలకొంది. మొదటి నుంచి చివరిదాకా ఫుల్లుగా నవ్వుకునేలా తీర్చిదిద్దిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఊపేస్తుందని యూనిట్ టాక్. ప్రమోషన్ కంటెంట్ చూస్తే అదే నిజమయ్యేలా ఉంది.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి సీనియర్ స్టార్లనే లక్ష్యంగా చేసుకున్న తీరు ఆసక్తి రేపుతోంది. తను ప్యాన్ ఇండియా మోజులో పడటం లేదు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ దొరికినా సరిలేరు నీకెవ్వరుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీసి సూపర్ హిట్టు కొట్టాడు. భగవంత్ కేసరిని థియేట్రికల్ గా అన్ని భాషల్లో రిలీజ్ చేయకపోయినా సినిమా చూసిన తమిళ స్టార్ విజయ్ ఏరికోరి తన 69వ చిత్రానికి దీన్నే రీమేక్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను గమనించాల్సిన విషయం. బాలకృష్ణను సరికొత్తగా చూపించిన వైనం అభిమానులతో పాటు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. డెబ్యూ పటాస్,రాజా ది గ్రేట్, సుప్రీమ్ అన్ని మీడియం బడ్జెట్ లోనే భారీ ఫలితాలు అందుకున్నవి.
ఇప్పుడు అనిల్ ఏకంగా మెగాస్టార్ ఛాన్స్ కొట్టేయబోతున్నాడు. సంక్రాంతి వస్తున్నాం రిలీజయ్యాక దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ షైన్ స్క్రీన్స్ నుంచి వచ్చే అవకాశముంది. తను చెప్పిన కథ చిరంజీవికి నచ్చడంతో ఫైనల్ నెరేషన్ ఓకే చేయించుకున్నాక ప్రకటన ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. భోళా శంకర్ తర్వాత కథలు దర్శకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చిరు కొత్త తరం డైరెక్టర్లతో చేతులు కలిపేందుకు మొగ్గు చూపుతున్నారు. నిన్న శ్రీకాంత్ ఓదెల, ఇవాళ అనిల్ రావిపూడి పేర్లు చూస్తుంటే ఫ్యాన్స్ కోరుకున్నట్టే వింటేజ్ చిరుని చూపించే డైరెక్టర్లే దొరుకుతున్నట్టుంది.