నేనూ చైతన్య ఎలా కలిశాం అంటే… : శోభిత!

సమంత నుంచి విడిపోయాక అక్కినేని నాగచైతన్య.. మళ్లీ ఇంత త్వరగా, ఇంకో నటిని పెళ్లి చేసుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. సామ్ నుంచి విడిపోయాక ఓ ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న అతను.. బాలీవుడ్లో స్థిరపడ్డ తెలుగు నటి శోభితతో కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఇటీవలే వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ముందు చైతూ-శోభిత ప్రేమాయణం గురించి వార్తలు వస్తే జనం అవి జస్ట్ రూమర్లని అనుకున్నారు. కానీ తర్వాత వీరి ప్రేమ నిజమే అని తేలింది.

ఇప్పుడు ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య అసలు ప్రేమ ఎలా మొదలైంది.. పెళ్లి వరకు ఎలా వచ్చారు అనే ఆసక్తి అందరిలోనూ ఉన్న మాట వాస్తవం. ఈ ప్రశ్నలకు ఒక ఇంటర్వ్యూలో శోభితనే స్వయంగా సమాధానం ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో చైతూ సైతం పాల్గొన్నాడు. ఇంతకీ చైతూతో పరిచయం, ప్రేమ గురించి శోభిత ఏమందంటే..?‘‘2022 ఏప్రిల్‌ నుంచి నేను చైతూను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నా. తర్వాత చైతూ కూడా నన్ను ఫాలో అయ్యాడు. నేను ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. నేను పెట్టే గ్లామర్‌ ఫొటోలు కాకుండా.. స్ఫూర్తిమంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లను నాగచైతన్య లైక్‌ చేసే వాడు.

నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్‌ గురించే మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. తెలుగులో మాట్లాడమని చైతూ నన్ను తరచూ అడిగేవాడు. అలా మాట్లాడ్డమే మా ఇద్దరి మధ్య బంధం బలపడేలా చేసింది. మొదటిసారి ముంబయిలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిశా. అప్పుడు చైతన్య హైదరాబాద్‌, నేను ముంబయిలో ఉండేవాళ్లం. నాకోసం హైదరాబాద్‌ నుంచి ముంబయి వచ్చేవాడు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్‌ డ్రెస్‌, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు.

ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటి నుంచి జరిగినదంతా అందరికీ తెలిసిందే. మా కుటుంబాలతో కలవడం విషయానికి వస్తే.. న్యూ ఈయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం నాగచైతన్య కుటుంబం నన్ను ఆహ్వానించింది. ఆ తర్వాతి సంవత్సరం చైతన్య నా కుటుంబాన్ని కలిశాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ నా ముందు పెట్టారు’’ అని శోభిత వెల్లడించింది.