బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు పరిచయమై అల్లు అర్జున్ హ్యాపీలో పోలీస్ ఆఫీసర్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ వేదం లాంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కాయి కానీ కొమరం పులి లాంటి చేదు జ్ఞాపకాలూ లేకపోలేదు. వీటి సంగతి ఎలా ఉన్నా రాంగోపాల్ వర్మ సత్య తెచ్చిన గుర్తింపే వేరు. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ భాషతో సంబంధం లేకుండా ఫాలోయింగ్ పెంచింది. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై లాంటి ఓటిటి మూవీస్ మరింత గౌరవాన్ని తీసుకొచ్చాయి. ఇక అసలు టాపిక్ కు వద్దాం.
ఇటీవలే మనోజ్ బాజ్ పాయ్ నటించిన డిస్పాచ్ నేరుగా డిజిటల్ రిలీజ్ జరుపుకుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దేశాన్ని కుదిపేసిన ఒక పెద్ద స్కామ్ మూలలను తవ్వే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో చాలా సవాళ్ళను ఎదురుకుంటాడు. వ్యక్తిగత జీవితంలో భార్యతో కాపురం కుదేలయ్యాక ఆఫీస్ కొలీగ్ తో ప్రేమాయణం నడుపుతుంటాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు, డ్రామా స్మార్ట్ స్క్రీన్ మీద చూడాలి. నటన పరంగా మరోసారి మనోజ్ భాజ్ పాయ్ అదరగొట్టాడు. కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా చివరి దాకా చూసేలా అనిపించింది మాత్రం ఆయన వల్లే. కానీ అసలు ట్విస్టు ఇది కాదు.
డిస్పాచ్ లో ఘాటైన రొమాన్స్ ని జొప్పించారు. ఇక్కడ వర్ణించడం భావ్యం కాదు కానీ ఆయన మూడు దశాబ్దాల కెరీర్ లో ఇంత బోల్డ్ గా ఎప్పుడూ నటించలేదు. పక్కన చిన్నపిల్లలు ఉంటే వెంటనే టీవీ కట్టేసేంత పచ్చిగా ఉన్నాయి ఆ సన్నివేశాలు. దెబ్బకు వాటిని వీడియోలుగా కట్ చేసి ఎక్స్ లో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. మనోజ్ ఇలాంటి కంటెంట్ చేశాడా అంటూ ఆశ్చర్యపోయి వెంటనే షోలు వేసుకుంటున్న వాళ్ళు బోలెడు.
ఇటీవలే దీని గురించి మనోజ్ మాట్లాడుతూ పల్లెటూరి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన తనలో సిగ్గరితనానికి ఇవి ఇబ్బంది కలిగించాయని, దర్శకుడు కను ఈ సీన్లు ఎంత అవసరమో చెప్పాక కాదనలేకపోయానన్నాడు. ఒకరకంగా ఇది సమర్ధించుకునే ప్రయత్నమే. అంచనాలు వీలైనంత తక్కువగా పెట్టుకుని చూస్తేనే ఓ మాదిరిగా అనిపించే డిస్పాచ్ ఈ బోల్డ్ సీన్స్ పుణ్యమాని సోషల్ మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చేసుకుంటోంది.