క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ మారిపోతోంది. ముందు ఈ పండక్కి అనుకున్న ‘తండేల్’ సినిమా వాయిదా పడిపోయింది. ఒక దశలో ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్‌కే వస్తుందన్నారు. అది సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇక లేటెస్ట్‌గా మరో క్రేజీ మూవీ రేసు నుంచి తప్పుకుంది. అదే.. రాబిన్ హుడ్. కొన్ని రోజుల ముందు వరకు క్రిస్మస్ రిలీజ్ డేట్‌కే కట్టుబడి ఉన్న ఈ చిత్రాన్ని తాజాగా పోటీ నుంచి తప్పించారు. ‘పుష్ప-2’ నిర్మాతలే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయగా.. పుష్ప-2కు క్రిస్మస్ సెలవుల్లోనూ మంచి ఆక్యుపెన్సీలు వస్తాయన్న ఉద్దేశంతో దానికి పోటీగా తమ బేనర్ నుంచి మరో సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇవి కాక ప్రియదర్శి-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘సారంగపాణి జాతకం’ కూడా ఏవో కారణాలతో పోటీ నుంచి తప్పుకుంది. ఇలా తెలుగు నుంచి ఒక్కో క్రేజీ సినిమా పోటీ నుంచి తప్పుకున్నాయి . దీంతో లేటుగా క్రిస్మస్ రేసులోకి అల్లరి నరేష్ సినిమా ‘బచ్చలమల్లి’ మాత్రమే పోటీలో నిలిచింది. క్రిస్మస్ వీకెండ్లో రానున్న మిగతా చిత్రాలన్నీ డబ్బింగ్‌వే. ఉపేంద్ర ‘యుఐ’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’తో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ముషాసా’ కూడా మంచి అంచనాలతోనే రిలీజవుతున్నప్పటికీ.. తెలుగు సినిమా కావడం ‘బచ్చలమల్లి’కి అడ్వాంటేజ్.
ఈ సినిమా ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాకు మంచి బజ్ వచ్చింది. కాబట్టి క్రిస్మస్ లాంటి క్రేజీ సీజన్లో ఈ చిత్రానికి మంచి అడ్వాంటేజ్ ఉన్నట్లే. ఇది బచ్చలమల్లి అనే నిజ జీవిత వ్యక్తి కథ కావడం విశేషం. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసిన అల్లరోడు.. ఇంత వైల్డ్ క్యారెక్టర్ చేయడం అనూహ్యం. సాయిధరమ్ తేజ్‌తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తీసిన సుబ్బు మంగాదేవి ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఇందులో నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. ఈ నెల 20న సినిమా రిలీజవుతుండగా.. ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.