మంచు వారి కుటుంబ గొడవ కాస్త సద్దుమణిగినట్లే కనిపిస్తుండగా.. మళ్లీ ఓ వివాదంతో ఆ ఫ్యామిలీ వార్తల్లోకి వచ్చింది. తన ఇంటి జనరేటర్లో తన అన్నయ్య మంచు విష్ణు చక్కెర పోసి కరెంట్ సరఫరా ఆగిపోయేలా చేశాడంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
జల్‌పల్లిలో మనోజ్ ఉన్న ఇంటికి ఇటీవల తన మనుషులతో కలిసి వచ్చిన విష్ణు.. జనరేటర్లో చక్కెర పోసి అది పని చేయకుండా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇలా చేస్తే కరెంట్ పోయిన సమయంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతాననే ఉద్దేశంతోనే విష్ణు ఇలా చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. ఎప్పుడు ఏంటి అన్నది తెలియదు కానీ.. విష్ణు ఈ ఇంటికి తన మనుషులతో కలిసి వచ్చి లోపలికి వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలను మనోజ్ మీడియాకు రిలీజ్ చేశాడు. అలాగే జనరేటర్లో పంచదార ఉన్న దృశ్యాలను కూడా మీడియాకు చూపించాడు మనోజ్.
గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో అంతర్గత గొడవలు మీడియాలో ఎంత చర్చనీయాంశంగా మారాయో తెలిసిందే. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో మీడియా దృష్టి అటు మళ్లగా.. మంచు ఫ్యామిలీ గురించి పెద్దగా వార్తలు లేవు. ఇరు వర్గాలు సైలెంట్ అయినట్లు కనిపించాయి.
తాను ఆవేశంలో దాడి చేయడం వల్ల గాయపడ్డ టీవీ9 కెమెరామన్‌ను తాజాగా మోహన్ బాబు.. విష్ణుతో కలిసి వెళ్లి పరామర్శించారు. దాడి విషయమై ఆయన క్షమాపణ చెబుతూ లేఖ కూడా విడుదల చేశారు. మోహన్ బాబు-విష్ణు… మనోజ్ మధ్య గొడవ సద్దుమణుగుతున్నట్లే కనిపించింది. ఇక ఆ టాపిక్ అందరూ మరిచిపోతున్నట్లే అనిపించింది. కానీ ఇప్పుడు మనోజ్ ఫిర్యాదుతో తిరిగి మీడియా దృష్టి అటు మళ్లింది. ఇంకా ఎన్నాళ్లూ ఈ వివాదం కొనసాగుతుంది.. విష్ణు-మనోజ్ రాజీకి రారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విష్ణు ఏమంటాడో చూడాలి.