జైలు నుండి అల్లు అర్జున్ విడుదల!

సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు ఈ రోజు ఉదయం 6.30 గంటలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 13 గంటల హైడ్రామాకు తెర దించుతూ ఆయనను జైలు అధికారులు ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో చంచల్ గూడ జైలు దగ్గరకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామయ్య, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ సన్నిహితులు, అభిమానులు చేరుకున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్, బెయిల్, విడుదల సినీ ఫక్కీలో తీవ్ర ఉత్కంఠ రేపింది. హఠాత్తుగా అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం, డ్రెస్ ఛేంజ్ చేసుకొని వస్తానని 5 నిమిషాలు సమయం అడిగినా పోలీసులు ఇవ్వకపోవడం వంటి పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక, అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం..అదే సమయంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. ఇక, నిన్న సాయంత్రం 5.30 గంటలకు అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించిన తర్వాత మరో హైడ్రామాకు తెర లేచింది.

రాత్రి 9-10 గంటలలోపు బన్నీ విడుదలవుతారని అంతా అనుకున్నప్పటికీ…టెక్నికల్ రీజన్స్ తో ఆయన నిన్న రాత్రి విడుదల కాలేదు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ కాపీ ఆన్ లైన్ లో అప్ లోడ్ కాలేదని, బెయిల్ పేపర్లలో సమాచారం అసంపూర్తిగా ఉందని, సమయం మించిపోయిందని…ఇలా రకరకాల టెక్నికల్ కారణాలతో అల్లు అర్జున్ ను నిన్న రాత్రి జైలు అధికారులు విడుదల చేయలేదు. దీంతో, రాత్రంతా జైల్లోనే అల్లు అర్జున్ ఉండాల్సి వచ్చింది. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్ లో ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత మంజీరా బ్లాక్ లో తనకు కేటాయించిన బారక్ లో ఉన్నారు.

జైలు అధికారులు ఆయనకు కొత్త దుప్పటి తదితర సౌకర్యాలు కల్పించినా అల్లు అర్జున్ వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖైదీ మాదిరిగానే అల్లు అర్జున్ నేలపై పడుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం అన్ని డాక్యుమెంట్లు, విడుదలకు సంబంధించిన అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేశారు