మార్కెట్ తక్కువో ఎక్కువో ఎంత ఉన్నా సరే హీరోలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో టచ్ లో ఉండేలా క్రమం తప్పకుండా తమ సినిమాల అప్డేట్స్ బయటికి వచ్చేలా చూసుకోవాలి. ఈ మధ్య శర్వానంద్ కు సంబంధించిన న్యూసులు బయటికి రావడం లేదు. ప్రస్తుతం తనవి రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఒకటి అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ తీస్తున్నది కాగా మరొకటి సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్లో అనిల్ సుంకర ప్లాన్ చేసుకున్నది. రెండు సమాంతరంగా జరిగేలా శర్వా డేట్లు ఇచ్చాడు కానీ ఏది ముందు విడుదలవుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి.
యువి ప్రస్తుతం బడ్జెట్ ఇష్యూస్ ని తీవ్రంగా ఎదురుకుంటోందట. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ మీద ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉంది. అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని వాయిదా వేశారు. కంగువలో తీసుకున్న భాగస్వామ్యం తీవ్ర నష్టాలు తీసుకొచ్చింది. మా నాన్న సూపర్ హీరో ఏమైనా అద్భుతం చేస్తుందేమో అనుకుంటే దారుణంగా డిజాస్టరయ్యింది. గోపీచంద్ – రాధాకృష్ణ కాంబోలో అనుకున్న భారీ చిత్రం చేతులు మారాల్సి వచ్చింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య శర్వా మూవీ కూడా నలిగిపోతోందని ఇన్ సైడ్ టాక్. లేకపోతే జనవరిలో రిలీజయ్యేలా తొలుత ప్లాన్ చేసుకున్నారు కానీ కుదరలేదట.
ఇక అనిల్ సుంకర తీస్తున్న సినిమా సైతం కొన్ని ఇబ్బందుల వల్ల నెమ్మదిగా జరుగుతోందని సమాచారం. ఒకే ఒక జీవితం తర్వాత శర్వానంద్ కు రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మనమే ఆశించిన ఫలితం ఇవ్వలేదు. పోనీ ఓటిటిలో పేరు తెస్తుందనుకుంటే నిర్మాత, థర్డ్ పార్టీ మధ్య వివాదం వల్ల డిజిటల్ రిలీజ్ జరగలేదు. సరే జరిగిపోయిన వాటి గురించి ఎందుకులే అనుకుంటే వీలైనంత త్వరగా శర్వా రెండు సినిమాల ప్రోగ్రెస్ ని బయటికి చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఆల్రెడీ జనవరి నుంచి ఏప్రిల్ దాకా రిలీజ్ డేట్లు లాకైపోతున్నాయి. ఏదో ఒక స్లాట్ ను ముందైతే లాక్ చేసుకోవడం బెటర్.