ఇళయరాజా బయోపిక్ ఆగిపోయిందా?

కేవలం దక్షిణాదిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులున్న ఇసైజ్ఞాని మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ కొంత కాలం క్రితమే మొదలైన సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ ధనుష్ పోషిస్తుండగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ అనౌన్స్ చేసిన కొన్నిరోజులు బాగానే జరిగింది కానీ ఆ తర్వాత టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈలోగా ధనుష్ కుబేర, ఇడ్లి కడాయ్ తో పాటు బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మేలో బిజీ అయిపోయాడు. దీంతో ఇళయరాజా సినిమా ఏమైందనే అనుమానం ఫ్యాన్స్ లో మొదలైంది. ట్విస్ట్ ఏంటంటే ఇది ఆగిపోయిందని చెన్నై వర్గాలు అంటున్నాయి. కారణాలు స్పష్టంగా లేవు.

నిర్మాతలు బడ్జెట్ లెక్కల దృష్ట్యా అంత భారం మోయలేక వద్దనుకున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి ఇళయరాజనే సంగీతం సమకూర్చడానికి ఒప్పుకున్నారు. తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ఘట్టాలు అన్నీ దర్శక రచయితలతో పంచుకున్నారు. బయటి వాళ్లకు తెలియని ఎన్నో కోణాలు ఇందులో చూడొచ్చని మ్యూజిక్ లవర్స్ ఆశపడ్డారు. కానీ అవి నీరుగారి పోయేలా ఉన్నాయి. నిజానికి రాజా సంగీత జీవితంలో కీలక పాత్ర పోషించిన దర్శకులు, హీరోలు ఎందరో ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళ స్థానాల్లో ఆర్టిస్టులను తీసుకోవడం టీమ్ కు పెద్ద సవాల్ గా మారిందట.

ఇది కూడా ఒక రీజన్ కావొచ్చు. ఏది ఏమైనా ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కథను తెరమీద చూసే ఛాన్స్ మిస్ కావడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా ఉంటుందని మరో టాక్ వినిపిస్తోంది. ఇళయరాజా మీద విపరీత అభిమానం చూపించే ధనుష్ ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవరయ్యాడు. కానీ ఇప్పుడు అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం సమకూర్చి ఇప్పటికీ విడుదల పార్ట్ 2 లాంటి వాటికి మ్యూజిక్ అందిస్తున్న మాస్ట్రో గురించి స్క్రీన్ మీద కాకపోయినా కనీసం పుస్తకం రూపంలో అయన లైఫ్ వస్తే బాగుంటుందేమో.