ప్రపంచంలో ఏదైనా వెతకాలన్నా, ఎవరి గురించైనా తెలుసుకోవాలన్నా అందరూ వాడేది గూగుల్ ఒక్కటే. సెర్చ్ ఇంజిన్లు ఎన్ని ఉన్నా దీనికున్న ఆదరణ ముందు ఏదైనా దిగదుడుపే. ఇంకా చెప్పాలంటే రోటి కపడా మకాన్ లాగా సెల్ ఫోన్ లో గూగుల్ అంత ముఖ్యమైన భాగమైపోయింది సగటు మనిషి జీవితంలో. మరి అలాంటి చోట ఎవరి గురించి జనాలు ఎక్కువగా వెతికారనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగం గురించి వేరే చెప్పాలా. దీనికి సమాధానంగా ప్రతి ఏడాది మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్ లిస్టుని ఈ సంస్థ ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. 2024కు సంబంధించి జాబితా బయటికి వచ్చింది.
అగ్ర స్థానాన్ని కాట్ విలియమ్స్ అధిష్టించగా రెండో ప్లేసుని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నాడు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, కోట్లాది ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ గా, ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుడిగా పవన్ ఇమేజ్ ఈ సంవత్సరం అమాంతం పెరిగిపోయింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేస్తున్న పనులతో పాటు ఓజి మీద పెరుగుతున్న క్రేజ్ ఏదో ఒక సందర్భంలో తన గురించి వెతికేలా చేస్తోంది. పవన్ తర్వాత ఆడమ్ బ్రాడీ, ఏలీయా పూర్నేల్ తదితరులున్నారు. బుల్లితెర సెన్సేషన్ హీనా ఖాన్ అయిదో ర్యాంకులో ఉండటం గమనార్షం.
వీళ్ళు కాకుండా కైరన్ కుల్కిన్, టెరెన్స్ హోవార్డ్, నిమ్రత్ కౌర్, పూనమ్ పాండే, రాధికా మర్చెంట్ టాప్ 10 లిస్టులో ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కు ఇది ఒకరకంగా గొప్ప ఘనతే. ఎందుకంటే మార్కెట్ పరంగా ఎంతో పైనున్న విజయ్, ప్రభాస్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళను కాదని జనాలు పవన్ కళ్యాణ్ గురించే సెర్చ్ చేయడమంటే విశేషమేగా. ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ తర్వాత ఓజి బ్యాలన్స్ కి గుమ్మడి కాయ కొట్టేస్తారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ పవన్ యాక్టివ్ గా పాల్గొనడం అక్కడ బీజేపీ కూటమి గెలుపులో ప్రభావం చూపించిందనే విశ్లేషణలు చాలా వచ్చాయి.