దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అంతగా అటాచ్ అయినట్టుగా కనిపించడం లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ని రంగంలోకి దించిన తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దేవి రాలేదు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఎలాంటి కబుర్లు పంచుకోలేదు. దర్శకుడు హరీష్ శంకర్ చెప్పినట్టు బిజీగా ఉండటం రీజన్ కావొచ్చు.

అయితే నిజమో కాదో నిర్ధారణ కాని ఇంకో విషయం కొంచెం విశ్లేషించుకోవాలి. మాములుగానే దేవిశ్రీ ప్రసాద్ పాత పాటలను రీమిక్స్ చేయడానికి పూర్తి వ్యతిరేకి. పలు సందర్భాల్లో దీన్ని చెప్పాడు కూడా. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ వదులుకోవడానికి కారణం ఇదేనని చెన్నై వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇలాంటివి బోలెడున్నాయి. దేవా కంపోజ్ చేసిన తొలిప్రేమలోని ఈ మనసే నా మనసే నేరుగా ఒరిజినల్ వెర్షన్ వాడేసుకున్నారు.

ఇది కాకుండా ఇళయరాజా స్వరపరిచిన రుద్రవీణలో తరలిరాదా తనే వసంతంకి బీట్స్ మిక్స్ చేసి ఫైట్ కోసం వాడుకున్నారు. నిజానికది స్ఫూర్తినిచ్చే హంటింగ్ మెలోడీ. సినిమా ప్రారంభంలో గుంటూరు కారం, ఆర్ఆర్ఆర్, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ బిట్స్ కూడా వాడుకున్నారు. ఇవన్నీ తెలియడం వల్లే దేవీశ్రీ ప్రసాద్ డిస్ కనెక్ట్ అయ్యి ఉంటారని తెలిస్తే అంత ఈజీగా కొట్టి పారేయలేం. ఎందుకంటే ఈ మనసే స్థానంలో మరో మంచి పాట ఇమ్మంటే దేవి కాదని చెప్పడు కదా.

గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. పుష్ప 2 సాంగ్స్ కంపోజ్ చేశాక బిజిఎం కోసం సామ్ సిఎస్ సహాయం తీసుకున్నా, నిన్న గుడ్ బ్యాడ్ అగ్లీని వదులుకున్నా, తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి వేరొకరికి ఇచ్చేసినా ఇవన్నీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనే జరిగాయి. సరే ఇది ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాతైనా బయట పడొచ్చు పడకపోవచ్చు కానీ ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. ఏది ఏమైనా దేవి మార్కు పూర్తిగా లేకపోవడం ఉస్తాద్ కు లోటే.