ఇటీవల వరుస సినిమాలు నిరాశపరచడంతో గోపీచంద్ మార్కెట్ చాలా వరకు డౌన్ అయ్యింది. ‘భీమా’తో కొంత ఊరట పొందినప్పటికీ, ‘విశ్వం’తో తిరిగి ఫ్లాప్ బాట పట్టాడు. ఈ నేపథ్యంలో గోపీచంద్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోపీచంద్ ఒక యువ దర్శకుడితో కలిసి కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొన్నటివరకు మాస్ కమర్షియల్ దర్శకులను నమ్మిన గోపి ఈసారి కంప్లీట్ గా అలాంటి దర్శకులను దూరం పెట్టాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఒక సినిమా అనుకున్నప్పటికి అది ఇంకా సెట్స్ పైకి రాలేదు.
ఇక ఇప్పుడు ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డిని లైన్ లోకి తెచ్చాడు. సంకల్ప్ రెడ్డి ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటాడు. ‘ఘాజీ’తో దేశానికి సంబంధించిన గొప్ప ఘట్టాన్ని హైలైట్ చేస్తూ ప్రశంసలు అందుకున్న సంకల్ప్, ‘అంతరిక్షం’తో మరో ప్రయోగం చేయగా అది షాక్ ఇచ్చింది. ‘ఐబీ-71’ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ సంకల్ప్ కథల విషయంలో ఎప్పుడూ కొత్తదనం చూపిస్తారనే పేరుంది.
ఇప్పుడు గోపీచంద్‌కు వినిపించిన కథ కూడా కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిందని తెలుస్తోంది. సంకల్ప్ రెడ్డి మాస్ కమర్షియల్ కథలను ఎప్పుడూ టచ్ చేయలేదు. అతని సినిమాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా ఉంటాయి. ఇక గోపీచంద్ తో కూడా రియల్ స్టోరీతోనే మెప్పించినట్లు తెలుస్తోంది. గోపి మాస్ ఆడియన్స్‌లో బలమైన ఫాలోయింగ్ కలిగి ఉండగా, ఈసారి ఈ కాంబినేషన్ ఏవిధంగా వర్క్ అవుట్ అవుతుందనే ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాకు చిట్టూరి శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘విశ్వం’ తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమా ఇదే అని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.