పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్లో మహిళ చనిపోయిన దుర్ఘటనకు అల్లు అర్జున్ స్పందించి ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసినా కూడా కొడుకు ముచ్చట తీర్చడం కోసం వచ్చిన కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించకుండా ఒక ప్రాణం సెలవు తీసుకోవడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది. సంఘటన చూసినవాళ్ళు, విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కదిలిపోయారు. నివాళులు అర్పించారు.
అల్లు అర్జున్ వీడియో సందేశంలో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆర్టిసి క్రాస్ రోడ్స్ కి వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడటం ఆనవాయితీగా మార్చుకున్నానని, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగడంతో పుష్ప 2 టీమ్ మొత్తం షాక్ లో ఉండిపోయిందని చెప్పాడు. దర్శకుడు సుకుమార్ తో పాటు తామందరం ఈ ఘటనకు కదిలిపోయామని, ఎవరికోసమైతే ఇంత కష్టపడి సినిమా తీస్తామో వాళ్ళకే ఇలా జరిగినప్పుడు ఆ వేదన తీరలేనిదని అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేమన్న అల్లు అర్జున్ పుష్ప 2 బృందం తరఫున సంతాపం ప్రకటించాడు.
తన తరఫున వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు అందజేస్తానని, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతుందని అన్నాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అబ్బాయికి అయ్యే ఖర్చు మొత్తం ప్రకటించిన పరిహారంతో సంబంధం లేకుండా తామే భరిస్తామని సందేశంలో పేర్కొన్నాడు. తమ పరిధిలో ఎంత సహాయం కావాలో అంతా చేస్తామని, త్వరలోనే కలుసుకుంటాని హామీ ఇచ్చాడు. ఈ బాధలో వాళ్ళు ఒంటరి కాదన్న అల్లు అర్జున్ ఇకపై ఇలాంటివి జరగకూడదని కోరుకుంటూ, ఈ హఠాత్పరిణామం తమను ఎంతగా కలిచి వేసిందో వివరించాడు. ఇలాంటి సమయంలో ఈ స్వాంతన ఆ కుటుంబానికి చాలా అవసరం
Gulte Telugu Telugu Political and Movie News Updates