‘ప్రేమ ఇష్క్ కాదల్’ లాంటి న్యూ ఏజ్ లవ్ స్టోరీతో దర్శకుడితో తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేశాడు పవన్ సాధినేని. తొలి సినిమా కాబట్టి అతడికి పేరున్న ఆర్టిస్టులు దొరకలేదు. పెద్ద బడ్జెట్ కూడా అందుబాటులో లేదు. ఉన్న పరిమితుల్లోనే అతను ప్రతిభను చాటుకున్నాడు. ఆ సినిమాతో వచ్చిన పేరుతో మంచి స్థాయికి చేరుతాడని అంతా అనుకున్నారు. కానీ అతడి రెండో సినిమా ‘సావిత్రి’ విడుదలకు ముందు మంచి అంచనాలు రేకెత్తించినా.. సినిమాలో అంత విషయం లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది.
ఆ సినిమా వచ్చి నాలుగేళ్ల తర్వాత కానీ పవన్ మరో సినిమా మొదలుపెట్టలేకపోయాడు. అతి కష్టం మీద మరో అవకాశం దక్కించుకున్నాడు కానీ.. అది అరంగేట్ర హీరో అయిన బెల్లంకొండ గణేష్‌తో కావడం గమనార్హం. ఈ సినిమాతో ఏమాత్రం సత్తా చాటుతాడో ఏమో కానీ.. తన రెండో సినిమా తన కెరీర్‌పై చాలా ప్రతికూల ప్రభావం చూపిందని అతనంటున్నాడు.
‘సావిత్రి’ సినిమాను వేరే వాళ్ళతో తీయాలనుకున్నానని.. కానీ వర్కవుట్ కాలేదని.. నారా రోహిత్‌తో తీశానని.. ఒక సినిమా పరాజయం పాలవడానికి అనేక కారణాలు దారి తీస్తాయని.. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగిందని.. ఐతే ఒక సినిమా ఫలితాన్ని బట్టి దర్శకుడిపై ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు పవన్.
‘సావిత్రి’ తర్వాత తాను అనుకున్న ఓ పెద్ద ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం కూడా తన కెరీర్ దెబ్బ తినడానికి ఓ కారణమని అతను అభిప్రాయపడ్డాడు. హరికృష్ణ-కళ్యాణ్ రామ్‌ల కలయికలో ఒక ఫాంటసీ మల్టీస్టారర్‌కు కథ రెడీ చేశానని.. అది జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చిందని.. కళ్యాణ్ రామ్ ఎంతో ప్రోత్సహించాడని.. కానీ ఆ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న సమయంలోనే హరికృష్ణ మరణించడంతో అది క్యాన్సిల్ అయిందని.. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని పవన్ అన్నాడు.