బ‌న్నీ స‌హా మొత్తం 12 మంది పై క్రిమిన‌ల్ కేసు..

అల్లు అర్జున్ సీక్వెల్ మూవీ పుష్ప‌-2 సినిమా ప్రేక్ష‌కుల‌ను, బ‌న్నీ అభిమానుల‌ను ఉర్తూత‌లూపేస్తున్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని చిక్క‌డ ప‌ల్లి పోలీసులు షాకింగ్‌ న్యూస్ చెప్పారు. పుష్ప‌-2 టీంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసిన‌ట్టు వివ‌రించారు. ఒక‌వైపు పుష్ప‌-2 టీం.. విజ‌యానందంలో మునిగి ఉన్న స‌మ‌యంలో పోలీసులు చెప్పిన న్యూస్‌.. సంచ‌ల‌నంగా మారింది. బ‌న్నీ స‌హా మొత్తం 12 మంది పుష్ప‌-2 టీం స‌భ్యుల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్టు చిక్క‌డ‌ప‌ల్లి స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ తాజాగా వెల్ల‌డించారు.

పుష్ప‌-2 మూవీ బెనిఫిట్ షోను.. బుధ‌వారం రాత్రి ప‌లు ధియోట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. తొలి షోతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. అయితే.. హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య సినిమా హాల్‌లో ప్ర‌ద‌ర్శించిన ఈ బెనిఫిట్ షోకు.. బ‌న్నీ స‌హా పుష్ప‌-2 టీం నుంచి 12 మంది హాజ‌ర‌య్యారు. వీరిలో అసిస్టెంట్ కెమెరామెన్ స‌హా ప‌లువురు ఉన్నారు. అయితే.. బ‌న్నీని చూసేందుకు అభిమానులు ఎగ‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో జ‌రిగిన తోపులాట‌లో ఓ మ‌హిళ మృతి చెంద‌గా ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

అయితే.. పోలీసులు త‌మ‌కు ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండానే బ‌న్నీ సినిమా హాల్ వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని, అందుకే క్రౌడ్ పెరిగిపోయి.. తోపులాట‌కు దారితీసింద‌ని పేర్కొంటూ.. పుష్ప‌-2 టీంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు ఇంచార్జ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు న‌మోదు చేశామ‌ని సీఐ చెప్పుకొచ్చారు. ఇది అత్యంత బాధ్య‌తా రాహిత్య‌మ‌ని సీఐ వ్యాఖ్యానించారు. క‌నీసం ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌డం సెల‌బ్రిటీల బాధ్య‌త‌గా చెప్పారు. కానీ, బ‌న్నీ ఆయ‌న టీం ఏమాత్రం బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హ‌రించార‌ని, దీనివ‌ల్లే తోపులాట జ‌రిగింద‌న్నారు.

ముంద‌స్తు స‌మాచారం ఇచ్చి ఉంటే.. మ‌రింత మంది పోలీసుల‌ను మోహ‌రించి.. అభిమానుల‌ను క‌ట్ట‌డి చేసేవార‌మ‌ని అన్నారు. ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా.. స‌ర్ ప్రైజ్ విజిట్ చేసి.. అభిమానులు తొపులాట‌కు దిగేందుకు పుష్ప‌-2 టీం కార‌ణ‌మ‌య్యా ర‌ని తెలిపారు. మ‌హిళ మృతి విష‌యాన్ని ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫల్యం లేద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. స్పాట్‌లో ఉన్న పోలీసుల‌ను కూడా విచారిస్తున్న‌ట్టు తెలిపారు. బాధ్య‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రించి మ‌హిళ మృతి కి కార‌ణ‌మైన పుష్ప‌-2 టీంపై ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు ప్రాథ‌మికంగా క్ర‌మిన‌ల్ కేసులు న‌మోదు చేస్తున్నామ‌న్నారు.