పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. దేవరకు ఎలాంటి వేడుకను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించకపోవడం, నోవాటెల్ లో ప్లాన్ చేసుకున్న దాన్ని రద్దు చేసుకోవడం వాళ్లను బాగా కలవరపెట్టాయి. పోనీ సక్సెస్ మీట్ రూపంలో అయినా జూనియర్ ఎన్టీఆర్ ని కలుసుకోవచ్చనుకుంటే దాన్ని ఎక్కడో దుబాయ్ లో చేసుకుని ఫ్యాన్స్ కి టీమ్ దిగిన ఫోటోలతో సరిపెట్టారు. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ కారణంగా చూపించి సర్దిచెప్పారు తప్పించి నిజంగా తలుచుకుని ఉంటే ఏపీ, తెలంగాణ ఎక్కడో ఓ చోట చేసి ఉండొచ్చనేది వాళ్ళ వెర్షన్.
ఇప్పుడు పుష్ప 2 అన్ని సందేహాలను తీర్చేసింది. అయిదు గంటలకు పైగా ఎలాంటి ఆటంకాలు లేకుండా భాగ్యనగరం నడిబొడ్డున యూసఫ్ గూడ లాంటి ఓపెన్ గ్రౌండ్ లో చేయడం మిగిలిన వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దేవర 500 కోట్ల వసూళ్లు సాధించినా ఈవెంట్ పరంగా చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఏ జ్ఞాపకం లేకుండా పోయింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా దేవర నిర్మాణ భాగస్వామిగా ఉన్న కళ్యాణ్ రామ్ మీద కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2కి సాధ్యమయ్యింది మీ వల్ల ఎందుకు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు . వాళ్ళ ఆవేదనలో లాజిక్ ఉంది కానీ ఎవరైనా ఏం చేయగలరు.
మళ్ళీ తారక్ కనిపించేది వార్ 2 ప్రమోషన్లలోనే. అదేమో వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజవుతుంది. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే. ఆర్ఆర్ఆర్ లాగా అదీ మల్టీస్టారర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే క్రెడిట్ ఉండదు. దేవరలాగా ఒక్కడినే చూడాలంటే మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాతోనే సాధ్యం. ఇంత గ్యాప్ ఉంది కాబట్టే దేవరకి ఏదైనా గ్రాండ్ గా జరిగి ఉండాలని కోరుకున్నారు. సరే గతం గతః అనుకుని ఇకపై హైదరాబాద్ లో ఏ ఈవెంట్ అయినా చేసుకోవచ్చనే కాన్ఫిడెన్స్ పుష్ప 2 ఇచ్చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక వ్యూస్ పరంగా దేవర దూకుడు భారీగా ఉంది.