గోదారి గట్టు మీద పాట బాగుందోయ్…

పెద్ద హీరోల సినిమాలకు బజ్ తెచ్చే విషయంలో పాటలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దర్శకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కేవలం ఒక్క సాంగ్ తో ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిన్న చిత్రాలు బోలెడు. అలాంటిది మ్యూజిక్ టేస్ట్ మెండుగా ఉండే వెంకటేష్ మూవీ అంటే వేరే చెప్పాలా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం తొలి ఆడియో సింగల్ రిలీజయ్యింది. మొదటిసారి వెంకీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తొలిసారి జంట కడుతున్నారు. టైటిల్ కు తగ్గట్టే పండక్కు థియేటర్లకు తెస్తున్నారు.

ఈ పాటకు ప్రధాన ఆకర్షణ రమణ గోగుల గాత్రం. ఒకప్పుడు సంగీత దర్శకుడిగా తమ్ముడు, బద్రి, యువరాజు లాంటి ఆల్బమ్స్ తో ఊపేసిన ఇతనిలో మంచి విలక్షణ గాయకుడు ఉన్నాడు. అధిక శాతం పాటలు ఆయనే పాడుకునేవారు. తర్వాత కొన్ని ఫ్లాపుల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రేమంటే ఇదేరాతో ఎవరైతే తనకు తొలి అవకాశం ఇచ్చారో ఇప్పుడు అదే వెంకటేష్ సినిమాకు సింగర్ గా కంబ్యాక్ ఇవ్వడం విశేషం. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యంలో మొగుడు పెళ్ళాల మధ్య చిలిపి శృంగారాన్ని సరదాగా వర్ణించిన తీరు, స్మూత్ మెలోడీగా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి.

వినగానే బాగుందనిపించేలా చేయడంలో భీమ్స్ సిసిరోలియో సక్సెసయ్యాడు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లతో పోటీ పడుతున్న సంక్రాంతికి వస్తున్నాంలో అనిల్ రావిపూడి వినోదానికి పెద్ద పీఠ వేశారన్న టాక్ ఇప్పటికే ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పటికీ ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ట్రీట్ మెంట్ ఉంటుందని వినికిడి. వెంకటేష్, ఐశ్యర్య రాజేష్ జోడి సింపుల్ స్టెప్పులతో అలరించేలా ఉంది. గత సంక్రాంతికి సైంధవ్ తో సీరియస్ జానర్ ట్రై చేసి షాక్ తిన్న వెంకటేష్ ఈసారి తనబలమైన ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్నాడు. ఎఫ్2, ఎఫ్3 ఇచ్చిన అనిల్ రావిపూడి తోడైతే చెప్పదేముంది.