రాజాసాబ్.. తేల్చుకోవాల్సిన టైమొచ్చింది!

2024 సంవత్సరం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అస్సలు కలిసి రాలేదు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువ నష్టాలు చూసిన సంస్థ ఇదే. దీంతో ఆశలన్నీ రాబోయే రాజాసాబ్ ప్రాజెక్ట్‌పై పైనే ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, మారుతి టేకింగ్ మీద భారీగా పెట్టుబడులు పెట్టిన విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా నష్టాలను రికవర్ చేయడంలో కీలక పాత్ర పోషించనుందని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.

ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ఓ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాగా రూపొందుతున్న రాజాసాబ్ పట్ల ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలున్నాయి. మొదట్లో మారుతి మేకింగ్ విధానం ప్రభాస్ రేంజ్‌కు సరిపోదేమో.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ పర్ఫెక్ట్ హారర్ స్టోరీ అనగానే అంచనాలు అమాంతం పెరిగాయి. దానికి తోడు లవర్ బాయ్ సీన్స్, కామెడీ కూడా సమపాళ్లలో ఉంటుందని హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, క్రిస్మస్‌కి టీజర్ రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక రాబోయే టీజర్ రాజాసాబ్ భవిష్యత్తుకు ప్రధాన ఆయుధం. టీజర్ కట్ లో ప్రభాస్ మ్యాజిక్, మారుతి హారర్ + కామెడీ టచ్ ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తే బజ్ అమాంతం పెరిగిపోతుంది. మొదటి టీజర్ ఈ సినిమాకు మార్కెట్‌లో టేబుల్ ప్రాఫిట్ అందించే కీలక అంశం అవుతుంది.

ఇంకా థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ కాలేదు. టీజర్ తరువాత అనుకున్న ధరలకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద స్టార్ హీరో హారర్ కాన్సెప్ట్ ట్రై చేయకపోవడం రాజాసాబ్ ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం. అసలే హారర్ డ్రామాలు క్లిక్కయితే కాసుల వర్షం కురిపిస్తాయి. మొన్న వచ్చిన స్త్రీ 2 కలెక్షన్స్ 800 కోట్లు దాటింది. ఇక రాజా సాబ్ క్లిక్కయితే లెక్క ఈజీగా వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.