‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మళ్లీ అక్కడికి వెళుతున్నాడా?

భారతీయ చిత్రాలకు కొత్తగా మంచి మార్కెట్ క్రియేట్ అయిన దేశాల్లో జపాన్ ఒకటి. 90వ దశకంలోనే ముత్తు సహా కొన్ని చిత్రాలు అక్కడ బాగా ఆడాయి. ఐతే ‘బాహుబలి’ తర్వాత వరుసగా భారతీయ చిత్రాలు అక్కడ వసూళ్ల మోత మోగిస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రాన్ని టీం అంతా జపాన్‌కు వెళ్లి మరీ బాగా ప్రమోట్ చేసింది. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి, సుబ్బరాజు తదితరులు అక్కడికి వెళ్లి ప్రివ్యూల్లో పాల్గొన్నారు. వీళ్లందరికీ అక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఐతే ప్రభాస్ తన తర్వాతి చిత్రాలను జపాన్‌లో రిలీజ్ చేసే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు.

కానీ రాజమౌళి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్‌లో బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయగా.. అక్కడ సంచలన వసూళ్లతో సాగిపోయింది. సంవత్సరం రోజుల పాటు సినిమా ఆడడం జపాన్‌లో ఇండియన్ సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టేయడం విశేషం.ఇప్పుడు ప్రభాస్ సైతం మళ్లీ జపాన్ మార్కెట్ మీద దృష్టిపెడుతున్నాడు. తన లాస్ట్ రిలీజ్ ‘కల్కి’ని జపనీస్‌లో రిలీజ్ చేయిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025 జనవరి 3న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను జపాన్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కంటే భారీగా రిలీజ్ ఉంటుందట.

ప్రభాస్ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయబోతున్నాడు. కుదిరితే అమితాబ్ బచ్చన్ కూడా జపా‌న్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. జపాన్‌తో పాటు చైనాలో కూడా భారతీయ చిత్రాలకు కొత్తగా మార్కెట్ క్రియేట్ అవుతోంది. ‘దంగల్’ చైనాలో సంచలన వసూళ్లు సాధించింది. విజయ్ సేతుపతి చిత్రం ‘మహారాజ’ ప్రస్తుతం చైనాలో ఆశ్చర్యపరిచే ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. ‘కల్కి’ కథ, విజువల్స్ ప్రకారం చూస్తే జపాన్‌లో ఆ సినిమా మంచి ఫలితాన్నే అందుకునేలా ఉంది.